Share News

భారీ వర్షం

ABN , Publish Date - May 29 , 2026 | 11:52 PM

మండలంలో శుక్రవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల వ్యాప్తంగా దాదాపు 200 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

భారీ వర్షం
చిలకలడోణలో నేలకొరిగిన విద్యుత్‌ స్తభం

ఉరుములు, మెరుపుల తో గాలివాన బీభత్సం

నేలకొరిగిన 200 విద్యుత్‌ స్తంభాలు

కూలిపోయిన 40 ట్రాన్స్‌ఫార్మర్లు

పొంగిపొర్లిన వాగులు, వంకలు

చెట్లు కూలి వ్యక్తి మృతి

రెండు ఎద్దులకు గాయాలు

నందవరం, మే 29(ఆంధజ్యోతి): మండలంలో శుక్రవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల వ్యాప్తంగా దాదాపు 200 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మరో 40 ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలో 22 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని నదికైరవాడి, గంగవరం, జోహరాపురం చిన్న కొత్తిలి, పెద్దకొత్తిలి, మిట్టాసోమాపురం, నాగలదిన్నె, గురుజాల, హలహర్వి, జగ్గాపురం, సోమలగూడురు, కనకవీడు, ముగతి, బాపురం, ఇబ్రహీంపురంలో ఉరుములు, మెరుపులకు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వేకువజాము నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఓపక్క ఉక్కపోత.. మరో పక్క కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యుత్‌ స్తంభాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

చెట్లు కూలడంతో..

ఇబ్రహీంపురం గ్రామంలో ఉదయం పొలంలో చెట్టు కిందఉన్న రైతు కృష్ణపై చెట్టు కూలిపడడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అలాగే రెండు ఎద్దులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతుడిని ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిం చారు. మృతుడికి నలుగురు పిల్లలున్నారు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పొలాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి

భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురువడంతో పొలాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. అదికారులు స్పందించి స్తంభాలకు మరమ్మతులు చేపట్టాలి. - కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్‌

మరమ్మతులు చేస్తున్నాం

మండలంలోని అన్నిగ్రామాల్లో సిబ్బందితో కలసి నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను తొలగిస్తున్నాం. మరి కొన్నిచోట్ల మరమ్మతులు చేసి గ్రామాల్లో కరెంట్‌ కష్టాలు లేకుం డా చూస్తున్నాం. శనివారం వరకు విద్యుత్‌ సరాఫరా నిలిపివేశాం. మరమ్మతులు పూర్తయితే కరెంటు పునరుద్ధరిస్తాం. - నాగేంద్ర, ఏఈ, ట్రాన్స్‌కో, నందవరం

మండలంలో కూలిన 52 విద్యుత్‌ స్తంభాలు

మంత్రాలయం, మే 29 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, గాలివానతో దాదాపు ఐదు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో 52 విద్యుత్‌ స్తంభాలు, 5 ట్రాన్స్‌ఫార్మర్లు , గుడిసె, చెట్లు నేలకొరిగాయి. దాదాపు రూ. 10 లక్షల దాకా ట్రాన్స్‌కో శాఖకు నష్టం వాటిల్లింది. ట్రాన్స్‌కో ఏఈ గోవిందు తన సిబ్బందితో విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా చేశారు. చిలకలడోణ, కల్లుదేవకుంట, చెట్నహళ్లి, సూగూరు, బూదూరు, వగరూరు, తిమ్మాపురం, మాలపల్లి, రచ్చమర్రి, పరమాన్‌దొడ్డి తండా గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. సూగూరులో బోయ కాశీం గుడిసె పైకప్పు గాలి తాకిడికి లేచిపోయింది. అదే గ్రామంలో రెండు, వి.తిమ్మాపురం గ్రామంలో రెండు, పరమాన్‌దొడ్డితండాలో ఒక ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గాలివానకు దెబ్బతిన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

కల్లూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి బలమైన గాలివానకు పలు గ్రామాల్లో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, పెద్దకడబూరు, నందవరం మండలాల్లోని దాదాపు 20 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 63 విద్యుత్‌ స్తంభాలు, 6 ట్రాన్స్‌ఫార్మర్లు, 9 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్‌ దెబ్బతిన్నాయి. ఈ సమస్యలపై ఫిర్యాదులు అందుకున్న ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్‌ ఆదేశాలతో అధికారులు సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన శుక్రవారం మధ్యాహ్నం సమయానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీని వల్ల విద్యుత్‌శాఖకు రూ.36 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 11:52 PM