ఆత్మకూరులో భారీగా నగదు పట్టివేత
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:50 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి కృష్ణమూర్తి నుంచి మంగళవారం పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు
రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.42.20 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆత్మకూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి కృష్ణమూర్తి నుంచి మంగళవారం పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశ్యంతో మద్యం, నగదు నిల్వలపై గట్టి నిఘా ఉంచామని అన్నారు. ఈక్రమంలోనే పట్టణంలోని రాటజావీధికి చెందిన భీమిశెట్టి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లో భారీగా నగదు నిల్వలు ఉన్నాయని సమాచారం రావడంతో అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ నారాయణరెడ్డి, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ బూర్గన్న, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, మున్సిపల్ అధికారులు షేక్ షాహీర్ బాషా, పిట్టర్ మురహరి ప్రసాద్, పోలీసు సిబ్బంది కలిసి ఆకస్మిక సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సోదాల్లో మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్ కబోర్డులో ఉంచినటువంటి రూ.42.20లక్షల నగదును గుర్తించామన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నగదును ఓటర్లకు పంపిణీ చేసే అవకాశం ఉండటంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తే ఆదాయ పన్ను శాఖ ద్వారా విచారణ చేపట్టి ఆతర్వాత చట్టబద్దంగా నగదును ఆయనకు అప్పగిస్తామని వెల్లడించారు. సమావేశంలో ఆత్మకూరు అర్బన్, రూరల్ సీఐలు మహేశ్వరరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.