డీజేతో గుండె గుభేల్
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:30 AM
పండగంటే సందడి.. ఊరేగింపంటే ఉత్సాహం.. ఆ ఉత్సాహానికి డీజే మోత తోడైతే యువతలో జోష్ మామూలుగా ఉండదు.
ఉత్సాహం సరే.. హద్దులు మీరితే ముప్పే!
యువత ప్రాణాలు హరిస్తున్న డీజే మోత
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
పండగంటే సందడి.. ఊరేగింపంటే ఉత్సాహం.. ఆ ఉత్సాహానికి డీజే మోత తోడైతే యువతలో జోష్ మామూలుగా ఉండదు. ఆ శబ్దం హద్దులు దాటితే? చెవులకు మాత్రమే కాదు.. శరీరానికి కూడా ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హద్దు మీరిన డీజే శబ్దాల వల్ల గుండె లయ తప్పి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఓ మహిళ, ఓ యువకుడు డీజే మోత కారణంగా అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. వీరి మరణాలకు డీజే శబ్దమే కారణమనే స్పష్టత లేకపోయినా.. అధిక శబ్దం, ఎక్కువ సేపు నృత్యం, గుంపుల్లో ఉక్కపోత, శారీరక శ్రమ, ముందస్తు ఆరోగ్య సమస్యలు కూడా ప్రమాద తీవ్రతకు కారణం అవుతున్నాయి. ఈ దృష్ట్యా పండుగ వేళ డీజేల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజే వల్ల కలిగే నష్టాలు, శబ్దానికి ఉండాల్సిన హద్దులు, శబ్దం మితిమీరితే తలెత్తే ఆరోగ్య సమస్యలు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో పల్లె అయినా, పట్నమైనా పెళ్లి ఊరేగింపులు, ఉత్సవాలు ఏవైనా సరే డీజే ఉండాల్సిందే. ఫలాన వ్యక్తి భారీ డీజే ఏర్పాటు చేస్తే, తగ్గేదేలే.. అంతకు మించి అంటూ పోటాపోటీగా డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. సమయపాలన లేకుండా డీజే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. సంబరాల్లో సందడి చేయాల్సిందే..! దానిని ఎవరు కూడా కాదనరు..! ఆ పేరిట ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దుంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగలు, పెళ్లిలు, జాతరలు, ఇతర శుభకార్యాలు.. అంతిమ యాత్రలు.. ఇలా ప్రతి సందర్భంలోనూ డీజేలు పెట్టడం సర్వసాధారణంగా మారింది. మితిమీరిన శబ్దాలు ప్రాణాలను హరిస్తున్నాయి. తోటి మిత్రులతో కలసి సంతోషం, ఉత్సాహంతో నృత్యం చేస్తున్నవారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. మితిమీరిన శబ్దాలు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, బ్రెయిన్ స్ట్రోక్, శాశ్వత వినికిడి లోపాలు.. వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శబ్దాల హోరుకు వృద్ధులే కాదు.. యువత సైతం బలవుతున్నారు.
శబ్దానికి హద్దు ఉంటుంది
కేంద్ర ప్రభుత్వ శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు ప్రకారం ప్రాంతాలు వారిగా పగులు, రాత్రి సమయాల్లో వెయిటెడ్ డెసిబెల్ (ఏ-డీబీ) ఎంత ఉండాలనే శబ్ద పరిమితులను నిర్ణయించింది. ఏ జోన్‌లో శబ్ద పరిమితి ఎంత ఉండాలో స్పష్టంగా వివరించింది.
ప్రాంతం ఉదయం 6 నుంచి మిగిలిన
(జోన్) రాత్రి 10 గంటలు సమయాల్లో
నిశబ్ద ప్రాంతం 50 40
నివాస ప్రాంతం 55 45
వాణిజ్య ప్రాంతం 65 55
పారిశ్రామిక ప్రాంతం 75 70
శబ్దం.. వినగల సమయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం శబ్దం, ధ్వని తీవ్రత పెరగేకొద్ది సురక్షితంగా వినగల సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతకు మంచి ఎక్కువ సమయం డీజేల దగ్గర ఉండడం సురక్షితం కాదని స్పష్టంగా పేర్కొంది. అధిక శబ్దాలు వల్ల చెవిలోని సున్నితమైన కణాలకు నష్టం కలగవచ్చని వెల్లడించింది. ఎంత డెసిబెల్ శబ్దాలను వారంలో ఎన్ని గంటలు వినవచ్చో వెల్లడించింది.
శబ్దం వినాల్సిన సమయం
(వారంలో)
80 డీబీ 40 గంటల వరకు
90 డీబీ సుమారు 4 గంటల వరకు
95 డీబీ సుమారు 1.15 గంటలు
100 డీబీ సుమారు 20 నిమిషాలు
110 డీబీ కేవలం 2 నిమిషాలు
30 సెక్షన్లలోపే
ఆ లక్షణాలు అనిపిస్తే డీజేకు దూరంగా వెళ్లాలి
వివిధ కార్యక్రమాల్లో డీజేలు ఏర్పాటు చేసి ఉంటే.. వాటి దగ్గర మీరు ఉన్నట్లైతే.. ఆ సమయంలో ఛాతిలో నొప్పి, గుండె దడ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, తీవ్రమైన బలహీనత, వాంతులు, చెవుల్లో నిరంతం మోగడం, చూపు మసకబారడం.. వంటి ఏమాత్రం నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా డీజేకు దూరంగా వెళ్లాలి. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి అత్యవసర వైద్యసాయం తీసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, డీజేల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. పండుగ, ఇతర ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కాలానికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. లౌడ్‌స్పీకర్లు, డీజేలు వినియో గానికి సంబంధిత అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పక తీసుకోవాలి. అదే సమయంలో డీజే నిర్వహకుడి నుంచి శబ్ద నిబంధ నలు పాటిస్తామని హామీని లిఖిత పూర్వకంగా తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఆస్పత్రుల సమీపంలో డీజే శబ్దాలను తగ్గించాలి
ఉరేగింపుల్లో అత్యవసర వైద్య సహాయానికి అవకాశం ఉండేలా ఓ మార్గాన్ని ఖాళీగా ఉంచాలి
విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వకుండా స్పష్టమైన శబ్ద/ధ్వని పరిమితులు విధించాలి
ఊరేగింపుల్లో డీజేల డెసిబెల్ స్థాయిని తనిఖీ చేయడానికి ప్రత్యేక మొబైల్ బృందాలు ఏర్పాటు చేయాలి
నిబంధనలు అతిక్రమించిన డీజే నిర్వహకులు, ఉత్సవ నిర్వహణ కమిటీలపై చర్యలు తీసుకోవాలి
ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ లేదా వాట్సాప్ నంబరును కేటాయించాలి
ఇటీవల జరిగిన ఘటనలు..
కర్నూలు రూరల్ మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలో నిమజ్జ నం సందర్భంగా డీజే ఏర్పాటు చేయడంతో శివమ్మ (36) అక్కడికి వెళ్లి.. కొద్దిసేపు నృత్యం కూడా చేశారు. కొద్దిసేపటికే కడుపులో నొప్పి వస్తుందని ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లగానే కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోతే, స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు.
డోన్ పట్టణం ఇందిరానగర్‌కు చెందిన గణేశ్‌గౌడ్ (23) స్థానిక వినాయక మండపానికి వెళ్లి, విగ్రహ ఊరేగింపులో పాల్గొని నృత్యం చేశారు. అస్వస్థతకు గురికావడంతో ఇంటికెళ్లిన కొద్దిసేపటికే ఆకస్మా త్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పారు.
ఎమ్మిగనూరు పట్టణం గంగన్న మసీదు ప్రాంతంలో 20 రోజుల క్రితం 22 ఏళ్ల యువకుడు ఓ పెళ్లి ఊరేగింపులో పాల్గొని డీజే ముందు నృత్యం చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందారని స్థానికులు పేర్కొం టున్నారు.
మండలం కేంద్రం కోసిగిలో పెద్ద సమీపంలో ఆరవ వార్డుకు చెందిన వీరేశ్ (25) అనే యువకుడు డీజే సౌండ్‌కు నృత్యం చేస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతిచెందారు. అదే మండలం దుద్ది గ్రామా నికి చెందిన ఆంజనేయులు (22) అనే యువకుడు పెళ్లిలో ఏర్పాటు చేసిన డీజే ముందు నృత్యం చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెం దారు. ఈ రెండు ఘటనలు ఏడాది క్రితం జరిగాయి.
అధిక శబ్దంతో ప్రాణాలకు ముప్పు
కేంద్ర ప్రభుత్వం శబ్ద కాలుష్య నియం త్రణ నిబంధనలకు మించి భారీ శబ్దాలు, ధ్వనులు ఆరోగ్యానికి ప్రమాదకరం, ప్రాణా లకు ముప్పు వాటిల్లుతుంది. అధిక శబ్దాలు వల్ల గుండె లయ తప్పడం, వినికిడి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని డబ్ల్యూ హెచ్‌వో స్పష్టంగా పేర్కొంది. డీజే శబ్దం విన్న వెంటనే గుండెపోటు వస్తుందని కచ్చితంగా చెప్పడానికి శాస్త్రీయంగా సరైంది కాదు. అయితే.. ఇప్పటికే గుండె సంబంధిత జబ్బులతో బాదపడుతున్న వారికి తీవ్రమైన శబ్దాలు ఆ సమస్యను మరింత తీవ్రత పెంచే ప్రమాదం ఉంది. తద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. అధిక శబ్దాలు వల్ల వినికిడి లోపం, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు.. వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డీజేలు దగ్గర ఉన్నప్పుడు ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, తల తిరగడం, వాంతులు, వికారంగా అనిపించడం.. వంటి లక్షణాలు అనిపిస్తే తక్షణమే దూరంగా వెళ్లి వైద్యులను సంప్రదించాలి. పరిమితి శబ్దాలతో సంబరాలు సంతోషంగా చేసుకుందాం.
- డాక్టర్ చింతా ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్,
కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం, జీజీహెచ్, కర్నూలు