అవినీతి హెడ్!
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:43 PM
ప్రతి నెలా వచ్చే వేతనం సరిపోలేదో ఏమో కానీ ఓ ఉద్యోగి ఏకంగా ప్రభుత్వ సొమ్ముకే ఎసరుపెట్టాడు.
నిధులు స్వాహా చేసిన సబ్ జైలు హెడ్ వార్డెర్
రూ.74 లక్షల ఇంధన సొమ్ము హాంఫట్
అంతర్గత ఆడిట్‌లో బహిర్గతం
కేసు నమోదు చేసిన బనగానపల్లె పోలీసులు
బనగానపల్లె, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా వచ్చే వేతనం సరిపోలేదో ఏమో కానీ ఓ ఉద్యోగి ఏకంగా ప్రభుత్వ సొమ్ముకే ఎసరుపెట్టాడు. నమ్మకంగా కేటాయించిన విధులను దుర్వినియోగం చేసి నిధులను స్వాహా చేశాడు ఓ సబ్‌జైలు హెడ్ వార్డర్. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్‌జైల్ హెడ్ వార్డర్‌గా పనిచేస్తున్న రామచంద్రా రెడ్డి అధికారుల కళ్లుకప్పి రూ.74 లక్షల పెట్రోల్ బంకులో వచ్చిన సొమ్మును కాజేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్‌జైలు హెడ్ వార్డర్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి 2022-25 కాలంలో బనగానపల్లెలో పనిచేశారు. ఆ సమయంలో సబ్‌జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకులో పంప్ ఇన్‌చార్జిగా వ్యవహించారు. ఆ మూడేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ కుంభకోణానికి పాల్పడ్డాడు. సాధారణంగా పెట్రోల్ బంకులో వసూలైన నగదును ప్రతి రోజూ సబ్‌జైలు బ్యాంకు ఖాతాకు చెల్లించడంతో పాటు అధికారులకు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. కానీ రామచంద్రారెడ్డి మాత్రం అలా చేసేవాడు కాదు. ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ పట్టించుకునే వినియోగదారుల నుంచి డబ్బును తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఉన్న క్యూఆర్ కోడ్‌కు బదిలీ చేయించుకునేవాడు. అంతేకాకుండా వినియోగదారులకు పెట్రోల్ పట్టించగా వచ్చిన నగదు అందజేసి.. పెద్ద మొత్తంలో తన వ్యక్తిగత ఫోన్‌పే/గూగుల్ పేకు మళ్లించుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఆన్‌లైన్ ద్వారా ప్రతి రోజూ వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో వేయించుకున్న డబ్బును సబ్‌జైల్ అకౌంట్‌లో జమ చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వచ్చాడు. ఇలా మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.74 లక్షల నిధులను స్వాహా చేశాడు. జైళ్ల శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో రామచంద్రారెడ్డి అవినీతి వ్యవహారం బయటపడింది. అప్పటి నుంచి పెట్రోల్, డీజల్ డబ్బు చెల్లించమని జైలు ఉన్నతాఽధికారులు అనేక సార్లు సబ్‌జైల్ వార్డర్ రామచంద్రారెడ్డిని అడుగుతూనే ఉన్నారు. పేరుమోసిన కాంట్రాక్టర్లు, పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు డీజల్, పెట్రోల్ పోయించుకున్నారని ఉన్నతాధికారులకు మభ్యపెడుతూ వచ్చాడు. స్వాహా సొమ్మును చెల్లిస్తానంటూ అధికారులకు తెలియజేసేవాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ సబ్‌జైలు సూపరింటెండెంట్ యోగేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శాఖాపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.