Share News

అంతా ఆయనే

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:29 PM

జిల్లా పరిషత్‌ పరిపాలన కార్యాలయంలో ఓ అధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు.

అంతా ఆయనే

జెడ్పీ పాలనా కార్యాలయంలో చక్రం తిప్పుతున్న అధికారి

మహిళలపై కక్ష సాధింపు

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

రాష్ట్ర మంత్రి పేషీకి చేరిన వ్యవహారం

కర్నూలు న్యూసిటీ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పరిపాలన కార్యాలయంలో ఓ అధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆయన ఇటీవల పదోన్నతిపై వేరే కార్యాలయానికి వెళ్లారు. అయినా అక్కడి నుంచే ఇక్కడి పనులన్నీ చక్కబెడుతున్నారనే ఆరోపణ ఉంది. ఇదంతా తెలిసినా చైర్మన్‌, అధికారులు ఎవ్వరూ అతడ్ని నిలువరించడం లేదు. ఈ క్రమంలో ఆయన కొందరు మహిళా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా గత నాలుగు నెలల నుంచి జరుగుతోంది. జడ్పీలో జరుగుతున్న ఈ వ్యవహారం చివరికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పేషీకి చేరింది. ఈ విషయంలో మంత్రి ఏమి చేస్తారో వేచి చూడాలి.

ఉద్యోగులపై చర్యలకు ఆదేశాలు..

జడ్పీ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించిన ఉద్యోగు లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే కనీసం ముగ్గురు ఉద్యోగులకు మెమోలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తప్పుచేసిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ఏమిటని తోటి అధికారులు, ఉద్యోగులు ప్రశ్ని స్తున్నారు. వాస్తవానికి ఆ అధికారి ఇటీవల పదోన్నతిపై ఇతర కార్యాలయానికి వెళ్లినా ఇక్కడ ఉండే చైర్మన్‌ కార్యకలాపాలన్నీ చక్కదిద్దుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం గంట సేపు చైర్మన్‌ పేషీలో కూర్చుని లావాదేవీలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై వేటు పడేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం...పర్సెంటేజీలు ఇస్తేనే ముందుకు

గతంలో ఇక్కడ పని చేసిన ఆ అధికారి ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం చేయడంతో పాటు పర్సెంటీజీలు ఇస్తేనే పైళ్లను ముందుకు కదిలిస్తారనే ఆరోపణలు ఉండేవి. ముఖ్యంగా జడ్పీ పరిపాలన భవనంలో పరిపాలన, ప్లానింగ్‌ 1అండ్‌2, పింఛన్‌, సచివాలయం, పీఎఫ్‌, అకౌంట్స్‌ విభాగాలు ఉన్నాయి. ప్రధానంగా పరిపాలన విభాగంలో ఏవైనా పదోన్నతులు, కారుణ్య నియామకాల ఫైళ్లు ఉంటే చైర్మన్‌ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. అదే విధంగా ప్లానింగ్‌ 1అండ్‌2లో కూడ చైర్మన్‌ అనుమతి కోసమే ఫైళ్లను పంపుతుంటారు. పింఛన్‌ విభాగంలో జడ్పీకి సంబంధించిన ఖర్చుల బిల్లులను అనుమతి కోసం పంపుతుంటారు. అకౌంట్స్‌, పీఎఫ్‌ ఫైళ్లు చైర్మన్‌ అనుమతి కోసం పంపాల్సిన అవసరం లేదు. కేవలం నాలుగు విభాగాల ఫైళ్లు మాత్రమే చైర్మన్‌ అనుమతి కోసం వెళ్లాలి. ఇందులో భాగంగానే ఏ ఫైలు వచ్చినా సదరు అధికారి ద్వారానే చైర్మన్‌కు చేరాలి. అయితే ఆయన తాను అనుకున్నది మాత్రమే చేస్తారనీ, కొన్ని పైళ్లకు పర్సెంటీజీలు ఇస్తేనే చైర్మన్‌ వద్దకు తీసికెళతారనీ, లేదంటే ఆ ఫైల్‌ కదలదనే ఆరోపణ ఉంది. ఇది పలుమార్లు చైర్మన్‌, సీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రశ్నించిన వారిపై వేటుకు సిద్ధం

ప్రశ్నించిన ఉద్యోగులకు బయటికి పంపించేందుకు జిల్లాలో ఎక్కడ ఖాళీలు ఉన్నదీ వెతికే పనిలో అధికారులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలని ఆ ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్ర మంత్రి పేషీకి వెళ్లినట్లు తెలిసింది. ప్రధానంగా పైళ్ల క్లియరెన్సులో ఆ ఉద్యోగికి పర్సెంటీజీలు ఇవ్వనందుకే ఇదంతా జరుగుతోందని సమాచారం.

ఇక్కడ జాప్యం జరగడం లేదు

జెడ్పీ పాలనా కార్యాలయంలో పనుల్లో జాప్యం లేదు. ఓ ఉద్యోగి పదోన్నతిపై వెళ్లిన తరువాత వేరే వారిని చైర్మన్‌ సీసీగా నియమించాం. కార్యాలయంలో పనులు సజావుగా సాగుతున్నాయి. ఎవ్వరు అక్రమాలకు పాల్పడటం లేదు. కార్యాలయంలో ఉద్యోగులకు మెమోలు ఇచ్చేది వాస్తవమే. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాము.

-జి. నాసరరెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ

Updated Date - Mar 28 , 2026 | 11:29 PM