Share News

కొలువుదీరింది

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:11 PM

జిల్లా పరిషత్‌ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. శుక్రవారం జడ్పీ సమావేశ భవనంలో ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి సమక్షంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు

కొలువుదీరింది

జడ్పీ చైర్మన్‌గా ఉలిగయ్య

వైస్‌ చైర్‌పర్సన్‌గా డా.షేక్‌ సాదిక

ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం

పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా: జడ్పీ చైర్మన్‌

కలిసికట్టుగా పనిచేద్దాం: వైస్‌ చైర్‌పర్సన్‌

కర్నూలు న్యూసిటీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. శుక్రవారం జడ్పీ సమావేశ భవనంలో ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి సమక్షంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.30గంటలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ప్రత్యేక ఆహ్వానితులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోడుమూరు ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, కే.ఈ.శ్యాంబాబు, డా.పార్థసారథి, దస్తగిరి హాజరయ్యారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా చూడి ఉలిగయ్య పేరును పత్తికొండ జడ్పీటీసీ సాంబశివారెడ్డి ప్రతిపాదించగా కోసిగి జడ్పీటీసీ గిరయ్యగారి జ్ఞానేష్‌ బలప రిచారు. జడ్పీ చైర్మన్‌ పదవికి ఎవరూ పోటీకి రాలేదు. జిల్లా విభజన అనంతరం మొట్టమొదటి జడ్పీ చైర్మన్‌గా కౌతాళం జడ్పీటీసీ చూడి ఉలిగయ్య ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌గా దేవనకొండ జడ్పీటీసీ డా.షేక్‌ సాదిక పేరును గూడూరు జడ్పీటీసీ నయోమి ప్రతిపాదించగా గోనెగండ్ల జడ్పీటీసీ తిరుపతయ్య బలపరిచారు. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి మరెవరూ పోటీ రాకపోవడంతో దేవనకొండ జడ్పీటీసీ డా.షేక్‌ సాదిక జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. ఎన్నికైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చూడి ఉలిగయ్య, వైస్‌ చైర్మన్‌ డా.షేక్‌ సాదికాకు కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రాలను అందజేసి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌ ఉలిగయ్య జడ్పీలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్టమ్మ, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతితో పాటు పలువురు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌డీవో అశ్విన్‌ కుమార్‌, పరిపాలన అధికారులు మురళీమోహన్‌రెడ్డి, జితేంద్ర, రాంగోపాల్‌, సరస్వతమ్మ, బసవశేఖర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధికి కృషిచేస్తా

జిల్లా పరిషత్‌ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. పశ్చిమ ప్రాంతంలో మౌలిక వసతులు, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా. కౌతాళం మండల జడ్పీటీసీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి పనిచేస్తా.

చూడి ఉలిగయ్య, జడ్పీ చైర్మన్‌, కర్నూలు

దివంగత సీఎం ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా పరిషత్‌కు జడ్పీటీసీలు బయలు దేరారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామరావు విగ్రహనికి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రజాసేవ చేస్తా

అందరూ కలిసికట్టుగా జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం. మంత్రి నారా లోకేశ్‌ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చా. వైద్య సేవలతో పాటు ప్రజా సేవ చేస్తా. వైస్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌, ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కే.ఈ.శ్యాంబాబు, జయనాగేశ్వరరెడ్డి, పార్థసారధి, బొగ్గుల దస్తగిరికి ధన్యవాదాలు

డా.షేక్‌ సాదిక, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌, కర్నూలు

Updated Date - Nov 20 , 2026 | 11:11 PM