Share News

హరోంహర..నీలకంఠేశ్వరా..!

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:51 AM

సాయంకాల సంధ్యావేళ.. మంగళవాయిద్యాలు.. భక్తల శివనామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజారు ప్రాంతం మారుమోగింది.

హరోంహర..నీలకంఠేశ్వరా..!
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

భక్తజనసంద్రమైన చేనేతపురి

వైభవంగా సాగిన నీలకంఠేశ్వరుడి రథోత్సవం

ఉత్సాహంగా ఎమ్మిగనూరు జాతరకు

ఎమ్మిగనూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సాయంకాల సంధ్యావేళ.. మంగళవాయిద్యాలు.. భక్తల శివనామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజారు ప్రాంతం మారుమోగింది. రథవీధులు భక్త జనంతో నిండిపోయాయి. వేదపండితులు వేదమంత్రాలను వల్లిస్తుండగా ఆదిదంపతులను భక్తి శ్రద్ధలతో.. వేదమంత్రాలతో మహారథంపైకి చేర్చారు. అందరి చూపు రథం కదలిక వైపే.. అందరి మదిలో భక్తిభావం.. సమయం సాయంత్రం 6:11 గంటలకు వేదపండితులు రథం లాగేందుకు సై అన్నారు. ఒక్కసారిగా వేలగొంతులేకమై హరోం..హర.. శంభోశంకరా.. జయహో నీలకంఠేశ్వరా.. అంటూ నినదించారు. 6:19 గంటలకు మార్కండేయుడి సన్నిధానానికి రథం చేరింది. అక్కడ పూజలు చేసి 6:39 గంటలకు రథం యథాస్థానానికి చేరడంతో రథోత్సవం ముగిసింది.

ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవం సందర్భంగా ఉదయం నుంచే ఆలయ నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ధర్మకర్త ఎద్దులింటి మాచాని నీలమర ళీధర్‌ ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో రథోత్సవ సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అలాగే మేళతాళాలతో గడిగే చెన్నప్ప కుటుంబీకులు కుంభం తీసుకొచ్చారు. రథం ముందు వేదపండి తులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణవాసులు, గ్రామాల ప్రజలు, భక్తులు తేరుబజారు ప్రాంతానికి చేరుకున్నారు. రథోత్సవం జరిగే సమయంలో రథంపై సాదారణ పూలతో పాటు కాగితపుపూలు వేయడం విశే షంగా ఆకట్టుకుంది.

Updated Date - Jan 06 , 2026 | 12:51 AM