Share News

కాశ్మీరి విద్యార్థినులపై వేధింపులు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:49 AM

ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో వివాదం నెలకొంది. రంజాన్‌ మాసంలో నర్సింగ్‌ కాలేజీలో సహరి, ఇఫ్తార్‌ ఏర్పాటు, హిజాబ్‌పై ఆంక్షలపై వివాదం తలెత్తింది.

కాశ్మీరి విద్యార్థినులపై వేధింపులు

కర్నూలు నర్సింగ్‌ కాలేజీలో వివాదం

సీఎంకు ఫిర్యాదు

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో వివాదం నెలకొంది. రంజాన్‌ మాసంలో నర్సింగ్‌ కాలేజీలో సహరి, ఇఫ్తార్‌ ఏర్పాటు, హిజాబ్‌పై ఆంక్షలపై వివాదం తలెత్తింది. కాలేజీలో చదువుతున్న కాశ్మీరి విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నాయని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని జమ్ము కాశ్మీర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ (జేకేఎ్‌సఏ) జాతీయ కన్వీనర్‌ నాసీర్‌ ఖుహెమి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో కాశ్మీరి విద్యార్థినుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ స్కీం (పీఎంఎ్‌సఎస్‌) కింద నర్సింగ్‌ కాలేజీలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థినులు 19 మంది చదువుతున్నారు. హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న కాశ్మీరి విద్యార్థినులు రంజాన్‌ మాసం భోజనం బయటి నుంచి తెప్పించుకోవడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, వసతులు కల్పించమని కోరితే అంగీకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాశ్మీరి విద్యార్థినులపై వివక్ష చూపుతున్నారన్నారు. ఇది వారి చదువుపై ప్రభావం చూపుతుందని వివరించారు. హిజాబ్‌ ధరించినందుకు ప్రశ్నిస్తున్నారని, తొలగించమని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణమే సీఎం విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్‌ డా. సిరి ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ విచారణ చేపట్టారు. కర్నూలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ పద్మావతి విచారణ నివేదికను కలెక్టర్‌, డీఎంఈకి పంపించారు.

అన్ని ఏర్పాట్లు చేశాం

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ కాలేజీలోని కాశ్మీరి విద్యార్థినులకు అన్ని ఏర్పాట్లు చేశామని కర్నూలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు. సోమవారం వైస్‌ ప్రిన్సిపాల్‌ మంజుల అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్‌ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన విద్యార్థినులు 19 మంది ఉన్నారనీ, ఇందులో 13 మంది హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారని తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా జొమేటో నుంచి ఏదైనా ఆహారం రాత్రి 9 గంటలలోపు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. అలాగే తెల్లవారుజామున కూడా మసీదు నుంచి భోజనానికి అనుమతి ఇచ్చామన్నారు. హీజాబ్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:49 AM