Share News

హరహర మహాదేవ

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:05 AM

హరహర మహాదేవ

హరహర మహాదేవ

శ్రీశైలంలో కనుల పండువగా రథోత్సవం

స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం

వైభవంగా కొనసాగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ముక్కంటీశుని ఆలయం భక్తజన సాగరమయ్యింది. కైలాసాన్ని శ్రీగిరి వీధులు తలపించాయి. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ శివభక్తులు చేసిన నామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగిపోయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపిం చారు. సాయంత్రం ఉత్సవమూర్తులను మేళతాళాలతో గంగాధర మండపం వద్దకు తీసుకునివచ్చి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై ఆశీనులనుజేశారు. రథాంగపూజలు, రథాంగ హోమం, రథాంగబలిలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్నము రాశులగాపోసి కుంభాన్ని సాత్వికబలిగా సమర్పించి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన వీధిలో జరిగిన రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో సకల పాపాలు తొలిగి కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు భక్తులకు వివరించారు. రథోత్సవ ఏర్పాట్లను కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పర్యవేక్షించారు.

సరస్వి పుష్కరిణిలో తెప్పోత్సవం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. విద్యుద్దీపకాంతులతో ప్రత్యేక అలంకారాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, సంప్రదాయ స్వాగత నృత్యాలతో ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామి, అమ్మవార్లకు తెప్పపై ఆశీనులజేసి షోడశోపచార పూజా క్రతువులు జరిపించారు. సరస్వి పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలుగా తిరుగుతూ తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో డీఐజీ కోయ ప్రవీణ్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు, డీఎస్పీ రామాంజినాయక్‌, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ఆల అనిల్‌కుమార్‌, బి.రవణమ్మ, శంకరశెట్టి పిచ్చయ్య, లక్ష్మీశ్వరి, సుబ్బలక్ష్మి, శ్రీదేవి, వెంకటసుబ్బారావు, శివమ్మ, క్రాంతివర్థిని, ఆలయ అధికారులు ఈఈ బాలమురళీకృష్ణ, నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్‌ అనిల్‌కుమార్‌, సీఐ గంగనాథ్‌ జీవన్‌బాబు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:05 AM