Share News

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హర్షం

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:57 PM

బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇది బీసీల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసిందని రాష్ట్ర సీడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హర్షం
సీఎం ప్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న నాగేశ్వరరావు యాదవ్‌

ఇది బీసీల ప్రభుత్వం

డోన్‌ టౌన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇది బీసీల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసిందని రాష్ట్ర సీడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు అండగా ఉంటామని మరోసారి తమ ప్రభుత్వం రుజువు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బీసీలు రాజకీయంగా ఎదగకుండా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అణచివేతకు గురి చేశారన్నారు. ఆర్థిక రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. దివంగత నందమూరి తారక రామారావు బీసీల రాజకీయ సాధికారత కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఆయన బాటలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి అనేక అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అలాగే సమాజంలో ప్రతి వర్గానికి కూడా అవకాశం కల్పించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

ఎమ్మిగనూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజరేష్టన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో 34శాతం ఉన్న రిజర్వేషన్లను 24.5 శాతానికి తగ్గించి బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ మళ్లీ 34శాతానికి పెంచేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఆవిర్భావం నుంచే టీడీపీ బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించిందని, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిత్యాన్ని మరింత బలోపేతం చేసేలా 34శాతం రిజర్వేషన్లును పునరుద్దరించటం పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని డీసీఎంఎస్‌ చైర్మన్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం నగరంలో బీసీ సంఘం కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్‌, నాయకులు వేణుమాదవ్‌, గంగాధర్‌, శివాజి, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:57 PM