Share News

రైతులకు సుఖీభవ

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:01 AM

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’, కేంద్ర పథకమైన ‘పీఎం కిసాన్‌ పథకం’ ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాల్లో శనివారం జమయ్యాయి.

 రైతులకు సుఖీభవ

ఒక్కొక్కరికి రూ.ఏడు వేలు

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధులు జమ

జిల్లాలో రూ.180.15 కోట్ల సాయం

సెల్‌ఫోన్లలో మెసేజ్‌ చూసి రైతుల్లో ఆనందం

కర్నూలు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’, కేంద్ర పథకమైన ‘పీఎం కిసాన్‌ పథకం’ ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాల్లో శనివారం జమయ్యాయి. పల్నాడు జిల్లా లింగంగుట్ల గ్రామంలో జరిగిన రైతు సభ నుంచి సీఎం చంద్రబాబు బటన్‌ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ.3,125 కోట్లు విడుదల చేశారు. ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో రూ.7 వేలు (కేంద్ర ప్రభు త్వం రూ.2 వేలు, రాష్ట్ర కూటమి ప్రభుత్వం రూ.5 వేలు) జమ అయ్యాయి. పెట్టుబడి జమ అయిన సంక్తిప్త సమాచారం సెల్‌ ఫోన్లలో చూసి రైతులు సంతోషించారు. సాగు పనులకు పెట్టుబడి సమస్య తీరిందని సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.180.15 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి పాణ్యం నియోజకవర్గంలోని 3,2978 మంది రైతులకు రూ.22.06 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో ఇచ్చిన ఈ సాయం రైతులకు కొండంత భరోసా ఇచ్చిందని అన్నారు.

రైతు మోమున దరహాసం:

ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నియోజకవర్గంలోని 38.318 మంది రైతులకు రూ.7వేలు చొప్పున రూ.25.63 కోట్లు జమ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు రైతుల పక్షాన బీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గూడూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జేసీ నూరల్‌ఖమర్‌ కోడుమూరు నియోజకరవ్గంలోని 35,052 మంది రైతులకు రూ.22.87 కోట్లు జమ చేశారు. కృష్ణగిరి మండలం తొగరచేడు గ్రామంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, పత్తికొండ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఆలంకొండ నబీసాహెబ్‌ పత్తికొండ నియోజకవర్గంలో 54,774 మంది రైతులకు రూ.36.84 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ఆదోని మండలం బల్లెకల్లు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ నియోజకవర్గంలో 18,722 మంది రైతులకు రూ.12.09 కోట్లు జమ చేశారు. మండల కేంద్రం కోసిగిలో జరిగిన కార్యక్రమంలో కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో 41,992 మంది రైతులకు రూ.27.44 కోట్లు జమ చేశారు. ఆలూరులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏడీఏ చెంగల్‌రాయుడు 63,317 మంది రైతులకు రూ.42.08 కోట్లు చెక్‌ను అందజేశారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం

కలెక్టర్‌ సిరి

ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి నిధులు విడుదల

కల్లూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ పథకం కింద జిల్లాలో అర్హులైన 2,72,757 మంది రైతులకు రూ.180.15 కోట్ల లబ్ది చేకూరిందన్నారు..శనివారం కల్లూరు మండలం ఉలిందకొండలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు శాస్ర్తీయ పద్ధతులను అనుసరించి పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాకు మొత్తం 92 వేల ఎకరాల లక్ష్యం నిర్దేశించగా అప్పటికే 70 వేల ఎకరాల్లో పీఎండీఎస్‌ కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు విడతల్లో రూ.3.60 కోట్లు విడుదల చేసిందన్నారు. అలగనూరు ప్రాజెకున్టు త్వరలో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎరువుల కోరత లేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, ఉలిందకొండ సిగింల్‌విండో చైర్మెన్‌ ఈవీ.రమణ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:01 AM