Share News

అటవీశాఖలో హనుమాన్‌

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:05 PM

మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ నివారించే దిశగా అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా హీలింగ్‌ అండ్‌ నుచరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్‌, ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌ (హనుమాన్‌) ప్రాజెక్టును రూపకల్పన చేసింది.

అటవీశాఖలో హనుమాన్‌
ఆత్మకూరు డివిజన్‌కు చేరిన ఆర్‌ఆర్‌ఆర్‌ వాహనం

వన్యప్రాణులు, ప్రజల రక్షణలో కీలకమైన ప్రాజెక్ట్‌

బైర్లూటిలో రీజనల్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు

గ్రామస్థాయిలో వజ్ర రక్షక్‌ వలంటీర్ల సేవలు

వన్యప్రాణుల కదలికలపై ఏఐ టెక్నాలజీతో నిఘా

ప్రాజెక్ట్‌ రూపకల్పనలో ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డీడీ విఘ్నే్‌షఅప్పావ్‌ కీలక పాత్ర

ఆత్మకూరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ నివారించే దిశగా అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా హీలింగ్‌ అండ్‌ నుచరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్‌, ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌ (హనుమాన్‌) ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఈ నెల 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలిసారిగా మానవ, వన్యప్రాణుల సంఘర్షణల నివారణకు ఏర్పాటు చేసిన సమగ్ర సాంకేతిక, శాస్ర్తీయమైన ప్రాజెక్ట్‌. హనుమాన్‌ వన్యప్రాణుల, ప్రజల రక్షణలో కీలకంగా మారనుంది. దీనికి రాష్ట్రస్థాయిలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఇటీవల వన్యప్రాణి, మానవ సంఘర్షణ అధికమైందని చెప్పవచ్చు. ప్రత్యేకించి చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు తదితర వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి పంటలను నష్టం చేకూర్చడమే కాకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగించాయి. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఓ పెద్దపులి సంచారం అక్కడి జీవ జీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వన్యప్రాణులు అటవీ సమీప గ్రామాల వైపు చేరి అలజడి సృష్టిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అడవి పందులు పంట పొలాల్లోకి చేరి నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆదోని పరిసర ప్రాంతాల్లో జింకలు పంట పొలాల్లో సంచరించడంతో పంటలు దెబ్బతింటున్నాయి. శ్రీశైలంలో ఓ పూజారి ఇంటి పరిసరాల్లో చిరుత సంచరించింది. కొత్తపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో ఓ ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడి జనాన్ని గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. అలాగే వెలుగోడు జలాశయం పరిసరాల్లోకి ఓ ఎలుగుబంటి చేరి అటవీ ఉద్యోగులపై దాడికి తెగబడిన సందర్భం లేకపోలేదు. ఇలాంటి సంఘటనల నియంత్రణలో హనుమాన్‌ పాత్ర కీలకంగా ఉండబోతోంది.

మనుషుల నుంచి వన్యప్రాణులకు కలుగుతున్న ముప్పును పరిశీలిస్తే..

అటవీశాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని వీలైనంత వరకు అటవీ అధికారుల వన్యప్రాణుల సంరక్షణకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వేటగాళ్లు వన్యప్రాణులకు ఉచ్చులు వేయడం, విద్యుత్‌ తీగలను అమర్చి వన్యప్రాణులను మట్టుపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అడవుల్లో నిప్పు రగిల్చి వన్యప్రాణులకు ముప్పు కలిగిస్తున్నారు. నల్లమలలో ఆహారం, నీటికొరత వల్ల వన్యప్రాణులు జనావాసాల వైపు మళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించేందుకు హనుమాన్‌ దోహదపడనుంది.

వన్యప్రాణుల రక్షణకై ఆర్‌ఆర్‌ఆర్‌ వాహనాలు, వైల్ట్‌లైఫ్‌ ఆంబులెన్స్‌లు

హనుమాన్‌ ప్రాజెక్ట్‌ రూపకల్పనలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణకై మొదటిసారిగా రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీతో కూడిన జీపీఎస్‌ ట్రాకింగ్‌ సదుపాయాలు గల 93 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ అండ్‌ రెస్క్యూ (ఆర్‌ఆర్‌ఆర్‌) వాహనాలను, 7 వైల్డ్‌లైఫ్‌ ఆంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మన జిల్లాకు సంబంధించి నంద్యాల, ఆత్మకూరు డివిజన్లకు ఒక్కో ఆర్‌ఆర్‌ఆర్‌ వాహనాన్ని కేటాయించారు. ప్రతి వాహనంలో అటవీశాఖ రేంజ్‌ ఆఫీసర్‌, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటర్నేరియన్స్‌, ట్రైన్డ్‌ అండ్‌ కమ్యూనిటీ బెస్డ్‌ వెటర్నేరియన్స్‌, కమ్యూనిటీ బేస్ట్‌ యానిమల్‌ వర్కర్లతో కూడిన పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ బృందం వారు రెగ్యులర్‌గా తమ డ్యూటీలను చేస్తూనే.. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ సేవలను అందించనున్నారు. అదేక్రమంలో గ్రామ స్థాయిలో కూగా వజ్ర రక్షక్‌ వలంటీర్లను నియమించి వారి సేవలను అందిపుచ్చుకోనున్నారు.

సంఘర్షణ నుంచి సహజీవనం వైపు

వన్యప్రాణులకు, ప్రజలకు మధ్య సంఘర్షణను సహజీవనంలా మార్చేందుకు హనుమాన్‌ ఒక గొప్ప కార్యసాధనంగా మారనుంది. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల రక్షణ, వారి జీవనోపాధులకు భద్రత కల్పించేలా హనుమాన్‌ భరోసా ఇవ్వనుంది. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలు కల్పించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అదే క్రమంలో ప్రజల్లో వన్యప్రాణుల సంరక్షణలో మరింత బాధ్యత కల్పించేలా చొరవ తీసుకుంటారు. ఉదాహరణకు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని నల్లమల అటవీ సమీప గ్రామాల్లోని మొక్కజొన్న, వరి పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. ఈ సంఘర్షణలో వన్యప్రాణులు వేటకు గురవుతున్నాయి. రైతులు పంటల సాగులో ప్రత్యామ్నాయంగా వరి, మొక్కజొన్నకు బదులు మినుము, నువ్వులు సాగు చేస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. వన్యప్రాణులు పాడి పశువుల మీద దాడి చేయకుండా ఉండేందుకై అటవీ, రెవెన్యూ సరిహద్దు ఏరియాల్లోని హాట్‌స్పాట్‌లను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఇనుప పెన్షింగ్‌ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాలని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీన్ని కూడా హనుమాన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అమలు చేయనున్నారు.

హనుమాన్‌ రూపకల్పనలో ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డీడీ విఘ్నే్‌ష అప్పావ్‌ ప్రధాన పాత్ర

హనుమాన్‌ రూపకల్పనలో ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డీడీ విఘ్నే్‌ష అప్పావ్‌ది ప్రధాన పాత్ర ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ఈ ప్రాజెక్ట్‌కు ఈయనే నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ నెల 3న మంగళగిరిలో జరిగిన హనుమాన్‌ ప్రారంభోత్సవంలో కూడా విఘ్నేష్‌ అప్పావ్‌ నేతృత్వంలో ఆత్మకూరు డివిజన్‌ నుంచి సుమారు 35మంది అటవీ సిబ్బందికి అక్కడికి చేరుకుని పలు నమూనాలను ప్రదర్శించారు. బైర్లూటి ఏకోటూరిజంలో హనుమాన్‌ ప్రాజెక్ట్‌ శిక్షణ ఇవ్వడంలో ఆయనదే ప్రధాన భూమిక.

బైర్లూటిలో రీజనల్‌ వైల్డ్‌ లైఫ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు :

హనుమాన్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో పాటు ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటిలో రీజనల్‌ వైల్ట్‌లైఫ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వైల్డ్‌లైఫ్‌ డిస్పెన్సరీలో భవనాల సామర్థ్యాన్ని మరింత పెంచడం, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, వైల్ట్‌లైఫ్‌ వెటర్నరీ వైద్యుల నియామకం, ఆపరేషన్‌ థియేటర్‌, మెరుగైన వైద్యపరికరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో వన్యప్రాణులు ప్రమాదాలకు, అనారోగ్యాలకు గురైతే ఇక్కడ చికిత్స అందిస్తారు.

Updated Date - Mar 06 , 2026 | 11:05 PM