Share News

హంద్రీ నీవా నీటితో కళకళ

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:22 PM

జిల్లాలో ఎమ్మిగ నూరు, డోన్‌, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనీవా నుంచి వచ్చి చేరుతున్న నీటితో కళకళలాడుతోంది.

హంద్రీ నీవా నీటితో కళకళ
హంద్రీనీవా నీటితో కళకళలాడుతున్న గాజులదిన్నె ప్రాజెక్టు

జీడీపీలో 2 టీఎంసీల నీరు

గోనెగండ్ల, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మిగ నూరు, డోన్‌, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనీవా నుంచి వచ్చి చేరుతున్న నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు ఉంది. నెల రోజుల క్రితం హంద్రీనీవా అధికారులు పందికోన దగ్గర ఉన్న హంద్రీనీవా జలాశయం నుంచి రోజుకు 300 క్యూసె క్కులను జీడీపీకి విడుదల చేస్తున్నారు.దాదాపు 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతున్నాయి. జీడీపీని 250 క్యూసెక్కుల వరకు వచ్చి చేరుతోంది. హంద్రీనీవా అధికారులు ఎన్ని రోజులు నీటి విడుదల కొనసాగుతున్నది స్పష్టంగా చెప్పలేదు.

స్పష్టమైన ప్రకటన కోసం..

జీడీపీ కింద ఉన్న ఆయకట్టు రైతులు ఈఏడాది రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో నీటి విడుదల ఉంటుందా లేదా అన్న అధికారుల స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెల ఆఖరులోపు ఎల్లెల్సీ నీరు కూడా విడుదల కావడం నిలిచిపోవచ్చనని సమాచారం. ప్రస్తుతం టీబీ డ్యామ్‌ లో 68 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజులు మాత్రమే ఆంధ్రా వాటా కింద నీటి విడుదల అవుతుందని, ఆ తర్వాత నీటి విడుదలను నిలిచిపోతున్నట్లు తెలుస్తుంది.

కర్నూలుకు 120 క్యూసెక్కుల నీరు..

జీడీపీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం కర్నూలుకు రోజుకు 120 క్యూసెక్కల నీరు జీడీపీ ఎడమ కాలువ నుంచి విడుదల చేస్తున్నారు. ప్రతి రోజు ఎండ వేడిమికి ప్రాజెక్టులో నీరు 30 నుంచి 50 క్యూసెక్కుల వరకు ఆవిరి రూపంలో వృథా అవుతుంది. బండగట్టు, డోన్‌, క్రిష్టగిరి, తాగునీటి పథకాలకు రోజుకు 10క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. అవసర సమయంలో కర్నూలు, కోడుమూడు, గూడురు, బెళగల్‌ ప్రాంతాలకు కూడా తాగునీటికి విడుదల చేయాలి. రబీ సీజన్‌ లో ప్రాజెక్టు కింద 24,500 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. అయితే 13వేల ఎకరాలకు మించి సాగు కావడం లేదు.

Updated Date - Oct 04 , 2026 | 11:22 PM