గుట్టుగా గుట్కా
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:16 AM
: పట్టణంలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యువత వీటికి అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి వీటికి అలవాటుపడితే ఇక జీవితాంతం బానిసలుగా మారే ప్రమాదం ఉంది.
పాన్ షాపులు, కిరాణ అంగళ్లలో విచ్చలవిడిగా విక్రయాలు
ఛిద్రమవుతున్న యువత భవిష్యత్తు
అడ్డుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవంటున్న పోలీసులు
బేతంచెర్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యువత వీటికి అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి వీటికి అలవాటుపడితే ఇక జీవితాంతం బానిసలుగా మారే ప్రమాదం ఉంది.
రహస్యంగా నిల్వ..
గుట్కా విక్రయాలను దుకణచారులు రహస్యంగా నిల్వ ఉంచుకుని విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు గుట్కా పాకెట్లను రహస్యంగా గోడౌన్లలో ఉంచుతున్నారు. వీటిని చాప కింద నీరులా పాన్ బంకులు, చిల్లర దుకాణాలకు రహస్యంగా చేరవేస్తున్నారు.
క్యాన్సర్ బారిన బాధితులు
గుట్కా తినేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉంది. దీంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నామవుతున్నాయి. చిన్న పాకెట్ల మాటున వీటిని విక్రయించి యువత భవిష్యత్తును వ్యాపారులు నాశనం చేస్తున్నారు. పంచాయత అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, వీటిని అడ్డుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ధర ఎక్కువైనా కొంటున్న యువత
గతంలో గుట్కా ప్యాకెట్ ధర రూ.5 మాత్రమే ఉఒండేది. అయితే నిషేధం ఉండటంతో ఏకంగా పాకెట్‌ను రూ.25కు అమ్ముతున్నారు.
అమలుకాని సుప్రీం కోర్టు తీర్పు
గుట్కా విక్రయాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా ఆ తీర్పు ఎక్కడా అమలు కావడం లేదు. కిరాణ అంగళ్లు మొదలు, పాన్‌షాపులు, బస్టాండ్లు, ఇతర చిల్లర దుకాణాల్లో యథేచ్చగా వీటిని విక్రయిస్తున్నారు.
స్పష్టమైన ఉత్తర్వులు లేవు
గుట్కాలను విక్రయించేందుకు తమకు పట్ల కోర్టు అనుమతి ఉందని వ్యాపారులు అంటున్నారు. వీటి నియంత్రణకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో ఏమీ చేయలేకున్నాం. - రమేష్ బాబు, ఎస్‌ఐ, బేతంచెర్ల.
గొంతు, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం
గుట్కాలు తినే వారికి గొంతు, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం ఉంది. యువత దీనికి బానిసగా మారకుండా చూసుకోవాలి. - డాక్టర్ వెంకటేశ్వర్లు, దంత వైద్యుడు, బేతంచెర్ల.