భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:18 AM
నగరంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజాము నుంచే సాయిబాబా ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కర్నూలు కల్చరల్, జూలై 29(ఆంధ్రజ్యోతి): నగరంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజాము నుంచే సాయిబాబా ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. వందలాదిగా భక్తులు క్యూలైన్లలో నిల్చొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ఆలయాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పాతనగరం సాయినగర్‌లోని దక్షిణ షిరిడీ సాయుబాబా దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ సాయినామ సంకీర్తన భజనలు బుధవారం వర కు కొనసాగాయి. దేవస్థానంలో ఉదయం మహాభిషేకం, విష్ణు సహస్ర నామ పారాయణం, ధునిపూజ, అన్న ప్రసాద వినియోగం, సాయి సత్యవ్రతము, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి, కాలహుండీ (ఉట్టి), రాత్రి 8 గంటలకు పల్లకిసేవ, 9.30 గంటలకు శేష్‌హారతి నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీమనోహర్, ఆర్. రామ్మోహన, ఎస్‌జీ మహాబలేష్ సాయిసేవకులు భక్తులకు సేవలు అందించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ షిరిడీ సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని సత్కరించారు. నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని సర్వస్వతి నగర్‌లోని శివదత్త సాయిబాబా ఆలయంలో కమిటీ ప్రతినిధులు బీవీ మల్లికార్జున రావు, డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పూజలు చేశారు. కొత్తపేటలోని నాగసాయిబాబా దేవాలయంలో బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. నెహ్రూనగర్‌లోని సత్యసాయి మందిరంలో ఉదయం నగర సంకీర్తన, భజనలు, సాయంత్రం వేద మంత్రపఠనం, భజనలు, పల్లకీ సేవ నిర్వహించారు. పాతనగరంలోని లలితాపీఠంలో వ్యాస మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. లలితాదేవి అమ్మవారికి సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చనలు చేశారు. వర్షాలు సకాలంలో కురవాలని ప్రార్థిస్తూ శ్రీ రాజశ్యామలా అమ్మవారి హోమము వేద పండితుడు రాజేశ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వీహెచపీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవంలో భాగంగా లలితాపీఠం పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామిని సత్కరించారు. వీహెచపీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, నాయకులు టి. ప్రతాపరెడ్డి, గోవిందరాజులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండలంలోని సోమయాజులపల్లె బస్ స్టేజీ సమీపంలోని శ్రీరామ రామేశ్వర షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తులు పూజలు చేశారు. ఆకుల మహేష్ ఆధ్వర్యంలో భజనలు ఆక ట్టుకున్నాయి. కాల్వబుగ్గలో వెలసిన షిరిడీ సాయిబాబా మందిరంలో ప్రొద్దుటూరు జిల్లా న్యాయాధికారి వెంకటేశ నాయక్, మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన మల్లికార్జున రెడ్డి సాయిబాబాకు పూజలు చేశారు. మాజీ సర్పంచ బద్దూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి, ప్యాలకుర్తి గ్రామాల్లో సాయినాథుడికి పూజలు చేశారు. ప్యాలకుర్తి సాయిబాబా ఆశ్రమంలో సామూహిక సత్యవ్రతం చేపట్టారు. సాయంత్రం సాయిబాబా చిత్ర పటాన్ని వాహనంపై ఉంచి ఊరేగించారు. పులకుర్తిలో సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.
గూడూరు: స్థానిక తిమ్మగురుడు స్వామి ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారికి అభిషేకం, అకుపూజలు నిర్వహించారు. అలాగే కాళీకామాత, సాయిబాబా ఆలయాల్లో పూజలు చేశారు.