గన్కల్చర్..
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:52 PM
స్థానిక సమరం మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 50 రోజుల పాటు ఐదారు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల వేళ పోలీసులకు సవాల్
జిల్లాలో 541 గన్ లైసెన్సులు
ఆయుధాలన్నీ పోలీ్సస్టేషన్లో అప్పజెప్పాల్సిందే
కర్నూలు క్రైం/ కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరం మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 50 రోజుల పాటు ఐదారు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకంటే స్థానిక ఎన్నికలకే ఎక్కువ ప్రభావం ఉంటుంది. పల్లెల్లో, మండల స్థాయిలో ఉండే నాయకులు ఈ ఎన్నికలను చాలెంజింగ్ తీసుకుంటారు. దీంతో గ్రామాల్లో గొడవలు, వివాదాలు తార స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చోటామోటా నాయకుల నుంచి బడబడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలకు ప్రధాన అనచరులు తమ భద్రత కోసం గన్ లైసెన్సులు తీసుకున్నారు. ఎన్నికల వేళ పోలీసులు ఈ గన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గన్లను స్థానిక ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో గన్ లైసెన్సుల తీరు ఇది
కర్నూలు జిల్లాలో 541 గన్లైసెన్నులు మంజూరయ్యాయి. వీటిలో బ్యాంకుల సెక్యూరిటీ, ఏటీఎంల కోసం నగదు రవాణా చేసే సెక్యూరిటీల కోసం 50 లైసెన్సులు ఉండగా.. మిగతావన్నీ రాజకీయ నాయకులు, వ్యాపారస్థుల వద్ద మాత్రమే ఉన్నాయి. వీటిలో డబుల్ బోర్ బ్యారెల్ గన్స్ (డీబీబీఎల్)-223, ఎన్పీ బోర్ రివాల్వర్లు 30, పిస్టల్స్ 56, రివాల్వర్లు 71, రైఫిల్స్ 22, ఎస్బీబీఎల్ 8, ఎస్బీబీఎల్ గన్నులు 130 ఉన్నాయి. మొత్తం 541 గన్ లైసెన్సులు ఉన్నాయి. ఆదోని సబ్ డివిజన్ పరిధిలో 54, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 268, పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలో 146, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో 73 తుపాకులు ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోనే టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 77, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 43, ఫోర్త్ టౌన్ పరిధిలో 35, తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో 31, వన్టౌన్ పరిధిలో 35, కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 13, బెళగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9, ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 17 గన్ లైసెన్సులు ఉన్నాయి. దేవనకొండ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో 39 గన్లైసెన్సులు ఉన్నాయి. ఆదోనిలో 26 గన్లైసెన్సులు ఉండగా.. హాలహర్వి పోలీస్ స్టేషన్ పరిధిలో 18, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 15, ఎమ్మిగనూరు మండలంలో 32 లైసెన్సులు ఉన్నాయి.
డిపాజిట్ తప్పనిసరి
ఎన్నికల నియమావళి ప్రకారం తుపాకులు కలిగి ఉండకూడదు. గన్లు ఉన్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలో 44, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 127, పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలో 124, ఎమ్మిగనూరు సబ్ డివిజ్ పరిధిలో 59 తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. ఇంకా 187 దాకా డిపాజిట్ చేయాల్సి ఉంది. కర్నూలు నగరంలో అత్యధికంగా డిపాజిట్ చేయాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఎన్నికల వేళ బందోబస్తు
స్థానిక ఎన్నికల సందర్బంగా లైసెన్సు ఆయుధాలు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఆయుధాలను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎలాంటి మారణాయుధాలు, ఇతర సామగ్రి లాంటివి లేకుండా క్షుణ్ణంగా కార్డెన్సెర్చ్ చేశాం. - విక్రాంత్ పాటిల్, ఎస్పీ, కర్నూలు