బీజేపీకి గూడూరు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:14 AM
స్థానిక సమరానికి తెర లేచింది. కూటమి పార్టీల మధ్య మేయర్, చైర్మన్ల స్థానాల కేటాయింపు కుదిరింది. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీకి దిగుతుందో గురువారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
టీడీపీకి కర్నూలు మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు చైర్మన్లు
‘గూడూరు’ను దక్కించుకున్న బీజేపీ
ఆదోనిపై జనసేనకు మిగిలిన నిరాశ
జనసేన, బీజేపీకి వార్డుల కేటాయింపుపై ఉత్కంఠ
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కర్నూలు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి తెర లేచింది. కూటమి పార్టీల మధ్య మేయర్, చైర్మన్ల స్థానాల కేటాయింపు కుదిరింది. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీకి దిగుతుందో గురువారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కర్నూలు మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ స్థానాల్లో చైర్మన్లుగా టీడీపీ పోటీ చేస్తుంది. గూడూరు నగర పంచాయతీలో బీజేపీ పోటీ చేయనుంది. అయితే.. ఆదోనిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న జనసేన ఇన్చార్జి ఎన్.మల్లప్పకు నిరాశే మిగిలింది. ఆ స్థానం టీడీపీకే కేటాయించారు. అయితే వార్డుల సర్దుబాటు కాకపోవడంతో ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలి..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి..? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో పోటీకి టీడీపీ అభ్యర్థులను సిద్ధం చేస్తుంది. కూటమి రాష్ట్ర సమన్వయక కమిటీ భేటీ నిర్ణయం మేరకు జనసేన, బీజేపీలకు సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నియోజకవర్గం నాయకులు కోరుతున్నారు. మరో వైపు తమకు బలంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులను పోరుకు సిద్ధం చేస్తున్నారు. తమకు స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని మిత్రపక్షాలు జనసేన, బీజేపీలు గట్టిగా పట్టుపడుతున్నాయి. పది రోజుల క్రితం కూటమి జిల్లా సమన్వయ కమిటీ సమావేశమైంది. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. స్థానిక రాజకీయం రోజురోజుకూ హీటెక్కిస్తోంది. పొత్తుల వ్యవహారం తేలకపోవడంతో మూడు పార్టీల నాయకులు ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో ఆశావహులతో పాటు పుర ప్రజల్లోనూ ఆసక్తి రెట్టింపవుతోంది.
కర్నూలు నగరపాలక సంస్థ మేయర్, 68 వార్డులు, ఆదోని మున్సిపాలిటీ చైర్మన్, 52 వార్డులు, ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్, 44 వార్డులు, గూడూరు నగర పంచాయతీ చైర్మన్, 23 వార్డుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి మున్సిపాలిటీల్లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వో)లు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ స్వీకరణకు 18వ తేది ఆఖరు గడువు. అంటే.. మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. తొలి రోజు శుక్రవారం మంచి రోజు కావడంతో మెజార్టీ ఆశావహులు నామినేషన్లు వేసేందుకు సన్నహాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులు ఖరారు కాకపోవడం, రిజర్వేషన్లకు అనుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక బలాబలాలను పరిగణలోకి తీసుకుని ఏ వార్డులో ఏ అభ్యర్థిని నిలపాలి.. ఏ వార్డు ఏ పార్టీకి కేటాయించాలి? అన్న అంశాలపై నిర్ణయం తీసుకోకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. మంచి రోజని నామినేషన్ వేస్తే, ఆ తరువాత పొత్తుల్లో భాగంగా మరో పార్టీకి కేటాయిస్తే, ఎన్నికల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే రాజకీయంగా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందని కేడర్ అభిప్రాయం. మొత్తం వార్డుల్లో 25 శాతం జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.
వార్డులపై కూటమి పట్టు
కర్నూలు నగరపాలక సంస్థ మేయర్గా టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారు. 68 వార్డులు ఉంటే, పొత్తుల్లో భాగంగా 25 శాతం తక్కుకుండా 15 వార్డులు కేటాయించాలని జనసేన ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదే స్థాయిలో 10కి తగ్గకుండా వార్డులు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు తలుస్తుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా సీట్లు సర్దుబాటుపై కూటమి నాయకులు అవగాహనకు రాకపోవడం హాట్ టాపిక్గా మారింది.
ఆదోని మున్సిపాలిటీలో 52 వార్డులు ఉంటే 10 వార్డులు జనసేనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రాతినిత్యం వహిస్తుండడంతో ఆ పార్టీకి టీడీపీతో సమానంగా వార్డులు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ చైర్మన్గా టీడీపీ అభ్యర్థిని బరిలో దింపుతుంది. ఇక్కడ 44 వార్డులు ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా 8-10 సీట్లు ఇవ్వాలని జనసేన గట్టిగా కోరుతుంది. బీజేపీ బలంగా ఉందని మాకు 6-8 వార్డులు కేటాయించాలని ఆ పార్టీ కోరుతుంది.
గూడూరు నగర పంచాయతీ చైర్మన్ స్థానం బీజేపీకే దక్కింది. ఈ సెగ్మెంట్లో 23 వార్డులు ఉన్నాయి. ఇక్కడ జనసేన 3-5 వార్డులను కోరుతోంది. ఇక టీడీపీ, బీజేపీ వార్డులపై స్పష్టత తెలియాల్సి ఉంది. బీజేపీకి కేటాయించడంతో ఎక్కువ స్థానాలు ఆ పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
కూటమి పార్టీ మధ్య మేయర్, చైర్మన్ పీఠాల పంపకాలు జరిగాయి. కర్నూలు మేయర్ పీఠం టీడీపీకే కేటాయించారు. ఈ ఇక్కడి నుంచి ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష పేరు దాదాపుగా ఖరారైంది. అయితే.. మరో ఇద్దరు మేయర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆదోని మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయిస్తారని మొదటి నుంచి విస్తృత ప్రచారం జరిగింది. ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి మల్లప్ప భార్య స్వప్న నాయకర్ను బరిలో దింపేందుకు ప్రయత్నించారు. అయితే పోత్తులో ఈ స్థానం టీడీపీకే దక్కింది. ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు కుమారుడు కె.భూపాల్ చౌదరి భార్య కె.సత్యమ్మ చైర్మన్గా బరిలో దింపుతారని భావించారు. ఆమె ఓటు మండిగిరి పంచాయతీలో ఉండడం, ఎస్కేడి కాలనీలో ఉన్న పాత ఇంటికి మార్చుకున్నా.. ఓటు ఫైనల్ కాలేదు. దీంతో అనూహ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు కె.ఉమాపతి నాయుడు కుమార్తె కొంకా సుస్మిత తెరపైకి వచ్చారు. ఈమెతో పాటు కాంట్రాక్టర్ బలరాంచౌదరి కుమార్తె నాగమణి కూడా తెరపైకి వచ్చారు. ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనాయరణ భార్య సువర్ణ కూడా చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎమ్మిగనూరు చైర్మన్ పీఠం టీడీపీకే కేటాయించారు. చైర్మన్ టికెట్ కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప (ఎంజీ) కుటుంబానికి చెందిన మున్సిపల్ దివంగత మాజీ చైర్మన్ మాచాని శివన్న మనవడు, టీడీపీ రాష్ట్ర బీసే సెల్ ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్కుమార్లు ఆశిసున్నారు. గూడూరు నగర పంచాయతీ చైర్మన్ పీఠం బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీలో ఇప్పటి వరకు బీజేపీ నాయకుడు డమాం సురేశ్ భార్య సునితాబాయి ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆమెకే దాదాపుగా ఖరారు అవుతుందని ఆ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది.
నంద్యాలలో అన్నీ టీడీపీకే
నంద్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలు టీడీపీకే దక్కాయి. బేతంచెర్ల స్థానాన్ని ఆశించిన బీజేపీకి నిరాశ కలిగింది. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, బేతంచెర్ల, డోన్ మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారు.