Share News

జామ.. రైతుకు ధీమా

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:00 AM

గత సీజన్‌లో వైరస్‌ ప్రభావంతో దిగుబడి లేక, ధర పడిపోవడంతో జామ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ ఏడాది ఎకరాకు 10 టన్నులు రాగా, మార్కెట్‌లో 25 కిలోల బాక్స్‌ రూ.1,400 పలుకుతుండటంతో ఈ ఏడాది నష్టాల నుంచి బయటపడ్డామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జామ.. రైతుకు ధీమా
చాగలమర్రిలో సాగు చేసిన జామతోట

ఈ ఏడాది పెరిగిన ధర, 25 కిలోల బాక్సు రూ.1,400

ఎకరాకు రూ.1.5 లక్షల ఆదాయం

చాగలమర్రి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంట జామ సాగుతో రైతులకు మేలు కలుగుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో 400 ఎకరాల్లో తైవాన్‌ బింక్‌, తైవాన్‌రెడ్‌, వీఎన్‌ఆర్‌ జామ రకాలను రైతులు సాగు చేశారు. అలాగే చాగలమర్రి మండలంలో చక్రవర్తులపల్లె, ముత్యాలపాడు, గొడిగనూరు, శెట్టివీడు, చాగలమర్రి తదితర గ్రామాల్లో 50 ఎకరాల్లో జామతోటలున్నాయి.

ఎకరాకు రూ. 50వేల పెట్టుబడి..

జామ తోటల సాగుకు రైతులు ఎకరాకు రూ.50 వేలు పెట్టిబడి పెట్టారు. గతేడాది వైరస్‌ కారణంగా దిగుబడి తగ్గింది. పండుఈగ దాడితో చేతికొచ్చిన జామకాయలు దెబ్బతిని నష్టపోయారు. అయితే ఈ ఏడాది ధరలు పెరగడంతో కోతకొచ్చిన జామకాయలతో రైతులకు ఊరటనిచ్చింది. ఎకరాకు 20 టన్నులు రావాల్సి ఉండగా కేవలం 4టన్నులు మాత్రమే వచ్చింది. అయితే ఈ ఏడాది 10 టన్నులదిగుబడి రావడంతో రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.

సిరులు కురిపిస్తున్న జామ

జామ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఎకరాకు 10 టన్నులు పైగా దిగుబడి వస్తోంది. ఈ లెక్కన 500 బాక్సుల వరకు దిగుబడి రావడంతో ఆదాయం పెరిగింది. ఖర్చులు పోయి రూ.1.5 లక్షలు ఆదాయం వస్తోందని, నష్టాన్ని పూడ్చుకొని గట్టెక్కామని రైతులు చెబుతున్నారు. దిగుబడి లేకున్నా ధర పెరగడంతో ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు.

ధర పెరగడంతో రైతు ఖుషీ..

వారం రోజులుగా మార్కెట్‌లో జామ ధరలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం 25కిలోల బాక్సు రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.1,400కు పెరిగింది. గత సీజన్‌లో ధరలేక ఇబ్బందులు పడ్డామని, ఈ ఏడాది ధరలు పెరగడం శుభసూచకమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రూ.2 లక్షల ఆదాయం వచ్చింది

ఈ ఏడాది జామతోట సాగుతో రూ.2 లక్షలు ఆదాయం వచ్చింది. 1.5 ఎకరాల పొలంలో సాగుచేశా, ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టా. మునుపెన్నడూ లేనట్లు 25 కేజీల బాక్సు రూ.1,400 పలకడంతో ఆదాయం వచ్చింది. - ఉసేన్‌బాషా, రైతు, చాగలమర్రి

Updated Date - Aug 17 , 2026 | 12:00 AM