Share News

రేయింబవళ్లు కాపలా

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:19 PM

భైరవాణి చెరువును తెలుగుగంగ నీటితో నింపుకొనేందుకు మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతులు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు.

రేయింబవళ్లు కాపలా
తెలుగుగంగ సబ్‌ చానల్‌ గట్టుపై దోమతెరలతో కాపలా కాస్తున్న రైతులు

తెలుగుగంగ సబ్‌ చానల్‌ గట్టుపైనే గోపవరం రైతుల స్థావరం

జలచౌర్యం జరగకుండా చెరువు నిండే దాకా కాపలా ఉంటామని స్పష్టం

తాగునీటి సమస్య తలెత్తకుండా ఏకమైన గ్రామస్థులు

మహానంది, సెప్టెంబరు 11(ఆంరఽధజ్యోతి): భైరవాణి చెరువును తెలుగుగంగ నీటితో నింపుకొనేందుకు మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతులు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో భైరవాణి చెరువుకు తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి 12వ బ్లాక్‌ సబ్‌ చానల్‌ ద్వారా పూర్తి స్థాయిలో నీటితో నింపుకొంటే తమకు తాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు భావించారు. అధికారుల చర్యల కోసం ఎదురు చూడకుండా తామే చెయ్యి చెయ్యి కలుపుకొని స్వతహాగా ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి చెందిన యువ రైతు పుల్లయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో 30 మంది రైతులు సబ్‌ చానల్‌ నుంచి చెరువు వరకు ఉన్న కిలో మీటర్‌ దూరం నుంచి సులభంగా నీరు ప్రవహించేందుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లతో పాటు కొంత మేర పేరుకుపోయిన షిల్ట్‌ను ఎక్స్‌కవేటర్‌ సాయంతో తొలగించే ఏర్పాట్లు చేసుకున్నారు. సబ్‌ చానల్‌ నుంచి వచ్చే నీరు వృథా కానివ్వకుండా రాత్రింబవళ్లు గట్టుపై కాపలాగా ఉంటున్నారు. అక్కడే సామూహిక భోజనాలు చేస్తున్నారు. రాత్రి సమయంలో దోమల బారిన పడకుండా దోమతెరలు ఏర్పాటు చేసుకున్నారు. 147 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భైరవాణి చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపుకొని నీటి ఎద్దడిని నివారించుకుంటామని రైతులు తెలిపారు. మరో పదిరోజుల్లో చెరువు పూర్తి స్థాయిలో నిండుతుందని, నీరు చౌర్యానికి గురి కాకుండా కాపల కాస్తున్నట్లు గోపవరం గ్రామ రైతులు తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 11:19 PM