Share News

ప్రమాదంలో జీఆర్‌పీ

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:21 PM

ప్రమాదంలో జీఆర్‌పీ

ప్రమాదంలో జీఆర్‌పీ
సూగూరు జలాశయం గండ్లు పూడ్చివేత పనులు

సూగూరు జలాశయానికి గండ్లు

నిర్వహణ లేక పటుత్వం కోల్పోతున్న మట్టి ఆనకట్ట

పదేళ్లుగా నిర్లక్ష్యం.. ప్రమాదంలో నాలుగు గ్రామాలు

శిథిలావస్థలో గురురాఘవేంద్ర ప్రాజెక్టులోని ఏడు జలాశయాలు

ఇప్పటికైనా పాలకులు మేల్కోవాలంటున్న నిపుణులు

గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు (జీఆర్‌పీ) ప్రమాదంలో పడింది. కరువు, వలసలతో తల్లడిల్లే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. జలాశయాల మట్టి ఆనకట్టలు పటుత్వం కోల్పోతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు జీఆర్‌పీ సూగూరు జలాశయానికి భారీ వరద చేరింది. బలహీనంగా మారిన మట్టి ఆనకట్ట రంధ్రాల్లో వరద నీరు చేరి గండ్లు పడ్డాయి. సకాలంలో రైతులు గుర్తించడంతో నాలుగు గ్రామాలకు పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లుగా నిధులే ఇవ్వలేదు. ఇప్పటికైనా పాలకులు నిధులు మంజూరు చేసిన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రాయలసీమ సాగునీటి నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనా కథనం.

కర్నూలు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా సరిహద్దుల్లో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. యే టేటా వందల టీఎంసీలు కడలిపాలు అవుతున్నాయి. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) చివరి ఆయకట్టుకు సాగునీరు అందని దైన్యపరిస్థితి ఉంది. వృథాగా సముద్రంలో కలుస్తున్న తుంగభద్ర వరద జలాలు 3.786 టీఎంసీలు ఎత్తిపోసి మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 45,790 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో 2003లో ఆనాటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, మంత్రి బీవీ మోహన్‌రెడ్డి పట్టుబట్టి నిధులు మంజూరు చేయించారు. 2003 ఆగస్టు 22న రూ.177 కోట్లు చేస్తూ ఆనాటి సీఎం చంద్రబాబు జీవో ఎంఎస్‌ నం.132 జారీ చేశారు. 1994లో నాటి సీఎం ఎన్టీఆర్‌ గురురాఘవేంద్ర కాలువగా నామకరణం చేశారు. పదేళ్ల తరువాత మోక్షం లభించింది. కోసిగి, మంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరు, కల్లూరు మండలాల్లో టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టుకు సాగునీరు అందించాలని మూగలదొడ్డి, పులచింత, చిలకలడోణ, సోగనూరు, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, కంబదహాల్‌, చింతమానుపల్లె ఎత్తిపోతల పథకాలు, నీటి నిల్వచేసేందుకు జలాశయాలు నిర్మాణం చేపట్టారు. 2005 మార్చి 23న ప్యాకేజీ-97 కింద మరో రూ.65.21 కోట్లు మంజూరు చేసి మాధవరం, బసలదొడ్డి, దుద్ది ఎత్తిపోతకాలు, జలాశయాలు నిర్మాణం చేసి దాదాపు రూ.242.48 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటుగా రూ.255 కోట్లతో పులికనుమ ప్రాజెక్టు, రూ.100 కోట్లతో పులకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మించారు. అంటే.. దాదాపుగా రూ.595 కోట్లకు పైగా ప్రజాధనం వెచ్చించి నిర్మాణం చేసిన గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు నిధుల ఇవ్వక.. నిర్వహణకు నోచుకోక రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితికి చేరుతోంది.

నిధులు లేవు.. మరమ్మతులు లేవు

గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా స్టేజ్‌-1 లిఫ్టులు 7, స్టేజ్‌-2 లిఫ్టులు 8 కలిపి 12 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. విద్యుత్‌ బిల్లులు, వివిధ మరమ్మతులు, నిర్వహణ సిబ్బంది (ఆపరేటర్లు) జీతాలు కోసం ప్రభుత్వం ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) కింద ఏటేటా నిధులు విడుదల చేస్తుంది. 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు సమస్య లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ అండ్‌ ఎం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. వైసీపీ హయాంలో ఐదేళ్ల నిర్లక్ష్యం శాపమైంది. ఎత్తిపోతల పథకాల దుస్థితి ‘గురువా.. గుండె చెరువా! అన్నట్లుగా మారింది. నిర్వహణ సిబ్బంది జీతాలు, పైపులైన్‌ మరమ్మతులు, తుంగభద్ర నదిలో అప్రోచ్‌ ఛానల్‌లో జంగిల్‌ క్లియరెన్స్‌, పూడికతీత, స్టాండ్‌బై పంపుసెట్లు, విద్యుత్‌ ప్యానల్‌ బోర్డు మరమ్మతులు, జలాశయాల మట్టి ఆనకట్టపై జంగిల్‌ క్లియరెన్స్‌, కట్ట బలోపేతం చేయడం.. వంటి పనులకు నిధులే ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలంటే దాదాపుగా రూ.95-100 కోట్లు అవసరమని 2024 జనవరిలో ఇంజనీర్లు ఆనాటి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పాలకుల్లో స్పందన కరువైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. నిర్వహణ లేక నీరసించిపోతున్న జీఆర్‌పీ ఎత్తిపోతల పథకాల పంప్‌ హౌస్‌లో మహారాష్ట్రకు చెందిన దోపిడీ దొంగలు పడి విద్యుత్‌ ప్యానల్‌ బోర్డులు, సబ్‌ స్టేషన్లో కాపర్‌వైరు దొంగలించుకుపోయారు. వాటి మరమ్మతులకు రూ.11 కోట్లు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా నిధులు వస్తాయన్న ఆశలు అడియాశలే అయ్యాయి. రెండేళ్లు గడిచినా ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమే. ఈ ఏడా ది మార్చిలో రూ.4.40 కోట్లు మంజూరు చేశారు.

గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా పెద్దకడుబూరు మండలం జలవాడి, మంత్రాలయం మండలం వగరూరు గ్రామాల మధ్య 0.135 టీఎంసీల సామర్థ్యంతో సూగూరు జలాశయం నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ కింద వగరూరు, తిమ్మాపురం, బూదూరు, సూగూరు, చెట్నెహల్లి గ్రామాల్లో దాదాపుగా 2,125 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ జలాశయం నిర్మాణం, భూ సేకరణతో కలిపి సుమారుగా రూ.12-15 కోట్లు ఖర్చు చేశారు. 20006లో ఆరంభమైన ఈ జలాశయం నిర్వహణను పాలకులు గాలికొదిలేశారు. మట్టి ఆనకట్ట ఇరువైపుల దట్టమైన ముళ్ల పొదలు పెరిగాయి. ఆ చెట్ల వేర్లు ఆనకట్టను చీల్చుకుంటూ వెళ్లాయి. దీంతో కట్ట పటుత్వం కోల్పోయింది. మరమ్మతులు చేయాలని పలుమార్లు రైతులు విన్నవించినా పట్టించుకోలేదు. ఆదివారం కురిసిన వర్షాలకు భారీగా వరద చేరింది. కట్ట మధ్యలో పైపింగ్‌ ఏర్పడి.. గండిగా మారింది. సకాలంలో స్థానిక రైతులు గుర్తించడం వల్ల రాత్రికి రాత్రే తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. టీబీపీ ఎల్లెల్సీ ఆదోని డివిజన్‌ ఈఈ శైలేశ్వర్‌ పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి ఉంటే.. ఆనకట్ట తెగిపోయేది. అదే జరిగి ఉంటే రాత్రికి రాత్రి వగరూరు, తిమ్మాపురం, సూగూరు, బూదూరు గ్రామాలు ముంపుకు గురయ్యేవని రైతులు ఏకరువు పెడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఎప్పటికైనా నాలుగు గ్రామాలకు ప్రమాదం పొంచిఉందని అంటున్నారు. సూగూరు ఒక్కటే కాదు.. మూగలదొడ్డి, దుద్ది, మాధవరం, బసలదొడ్డి, చిలకలడోణ, పులచింత, సోగనూరు జలాశయాలు కూడా నిర్వహణ లేక ఆనకట్టలు బలహీనమై శిథిలావస్థకు చేరుకున్నాయి. శాశ్వత మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

కంప చెట్లు పెరిగిపోయాయి

సూగూరు జలాశయం నిర్మాణం చేసి 20 ఏళ్లు అవుతోంది. నిర్వహణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. మట్టి ఆనకట్ట ఇరువైపుల కంప చెట్లు పెరిగిపోయాయి. వేర్లు మట్టికట్టలో కూరుకుపోయి. ఆదివారం వర్షాలకు వరద రావడంతో గండి పడింది. సకాలంలో గుర్తించి ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి సహకారంతో తాత్కాలిక మరమ్మతు చేశాం. ఈ ప్రాజెక్టు కింద నాకు మూడెకరాలు ఆయకట్టు ఉంది.

- అబ్దుల్లా, టీడీపీ సీనియర్‌ నాయకుడు, వగనూరు, మంత్రాలయం మండలం:

నిర్లక్ష్యం చేసి ఉంటే గ్రామం మునిగిపోయేంది

ఆదివారం రాత్రి గండి పడిందని తెలిసింది. రైతులు, గ్రామస్థులు అప్రమత్తమవ్వడం వల్ల ప్రమాదం తప్పింది. లేదంటే మా ఊరు మునిగిపోయేది. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి మరమ్మతులు చేయడం లేదు. ఏటేటా ముళ్ల కంప చెట్లు తొలగించాలి. గండిని శాశ్వతంతా మరమ్మతులు చేయాలి. ఈ ప్రాజెక్టు నీటిని వాడుకొని ఎకరం పొలం సాగు చేస్తున్నాం.

- లింగప్ప, వగరూరు గ్రామం:

నాలుగు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది

సూగూరు జలాశయం కిందనే వగరూరు, తిమ్మాపురం, సూగూరు, బూదూరు గ్రామాలు ఉన్నాయి. ఆనకట్ట తెగిపోతే నాలుగు గ్రామాలు మునిగిపోక తప్పదు. ఆనకట్టను బలోపేతం చేసి మా ఊళ్లను కాపాడాలి.

- పెద్దరంగప్ప, రైతు, వగరూరు

ఈ జలాశయం జీనాధారం

మా గ్రామాలను ఏటేటా కరువు, వలసలు వెంటాడుతున్నాయి. వర్షాలు రాకపోతే ఊళ్లు వదలాల్సి వస్తుంది. టీడీపీ ప్రభుత్వం గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా సూసూరు జలాశయం నిర్మాణం చేశారు. ఈ చెరువు మాకు జీవనాధారం. మరమ్మతులు చేసి బాగు చేయాలి. గండి పడిందని తెలియగానే మాకు నిద్రలేదు.

- గోపాల్‌, వగరూరు

నిర్మించారు.. వదిలేశారు

సూగూరు జలాశయం నిర్మించారు.. వదిలేశారు. ఏనాడూ ఆనకట్టపై దట్టంగా పెరుగుతున్న ముళ్లకంప చెట్లు తొలగించే పనులు చేయలేదు. నిర్లక్ష్యం వల్లే గండి పడింది. వర్షాకాలం రాకముందే ఆనకట్టను పరిశీలించి, కంపచెట్లు తొలగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. శాశ్వత మరమ్మతులు చేయాలి.

- బి.మల్లేశ్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు, వగరూరు గ్రామం

తక్షణ మరమ్మతులు చేపట్టాం

గురురాఘవేంద్ర ప్రాజెక్టు సూగూరు రిజర్వాయర్‌కు ఆదివారం గండి పడిందని తెలియగానే రాత్రే వెళ్లి మరమ్మతులు చేశాం. ఆ రంధ్రానికి వంద మీటర్ల దూరంలో మరో పైపింగ్‌ ఏర్పడిందని గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేశాం. ప్రస్తుతానికి గండ్లను పూడ్చివేశాం. శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.

- శైలేశ్వర్‌, ఈఈ, టీబీపీ ఎల్లెల్సీ డివిజన్‌, ఆదోని

Updated Date - Jun 16 , 2026 | 11:21 PM