Share News

భూ రాబందులు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:48 PM

భూ రాబందులు సమాధులను సైతం వదలడం లేదు. కూటమికి చెందిన ఓ సొసైటీ డైరెక్టర్‌ ఏకంగా రూ.3 కోట్ల విలువ చేసే శ్మశాన వాటికపై వాలిపోయాడు.

భూ రాబందులు
కబ్జాకు గురైన ఎస్‌. కొండాపురం శ్మశాన వాటిక

శ్మశాన వాటికపై వాలిన కూటమి నేతలు

రూ.3కోట్ల స్థలం కబ్జా

సమాధులను కూడా వదలని వైనం

70 సెంట్లలో ప్లాట్లు

భూ రాబందులు సమాధులను సైతం వదలడం లేదు. కూటమికి చెందిన ఓ సొసైటీ డైరెక్టర్‌ ఏకంగా రూ.3 కోట్ల విలువ చేసే శ్మశాన వాటికపై వాలిపోయాడు. సమాజం తల దించుకునేలా చేశాడు. ఆ భూబకాసురుడు కబ్జా తీరు ఆదోని ప్రజలను విస్మయానికి గురిచేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ శ్రేణులు భూకబ్జాలకు పాల్పడడంతోనే సాయిప్రసాద్‌రెడ్డికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అంతకుమించి అన్నట్లుగా కూటమికి చెందిన ఓ పార్టీ ముఖ్య నాయకుడు, సొసైటీ డైరెక్టర్‌ ప్రవర్తిస్తున్నాడు. సమాధులు ఉన్న శ్మశాన వాటికపై వాలి రాళ్లు పాతడమే కాకుండా ప్లాట్లు వేశాడు. చట్టానికి బద్ధులై ఉండవలసిన పార్టీ నాయకుడు ఇలా చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఇంత జరుగుతున్నా అధికారులు నిద్ర వీడలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదోని/ఆదోని రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): భూకబ్జాకోరులు శ్మశాన వాటికను సైతం వదలడం లేదు. రాబందుల్లా వచ్చి వాలిపోతున్నారు. ఆదోని మండలం బైచిగేరి పంచాయతీ పరిధిలో 1957లో ఆమ్లేట్‌ విలేజీ ఎస్‌.కొండాపురం (రాజానగర్‌) ఏర్పడింది. తమిళనాడు నుంచి వలస వచ్చిన 50కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. . ఇక్కడ నివసించే వారు మృత్యువాత పడితే ఆదోని-ఎమ్మిగనూరు బైపాస్‌ ప్రధాన రహదారిలో సర్వే నెంబరు 91లో ఈ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక కోసం 78 సెంట్లను ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఆ గ్రామంలో మృతి చెందిన పలువురిని ఈ స్థలంలోనే సమాధి చేశారు. ప్రస్తుతం ఈసర్వే 91 సమీపంలోనే ప్రభుత్వ భూమి సర్వే నెం.104లో ఆర్టీవో కార్యాలయానికి ఐదెకరాలు, డిగ్రీ కాలేజీకి పదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో భూములు ధరలకు రెక్కలొచ్చాయి. సర్వే నెం.91లో ఉన్న 78సెంట్ల స్థలంపై కూటమి పార్టీకి చెందిన ఓ సొసైటీ యువ డైరెక్టర్‌ కన్ను పడింది.

గుట్టు చప్పుడు కాకుండా..

గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రైవేట్‌ సర్వేయర్లతో సర్వే చేయించి ఆ స్థలంలో ప్లాట్లు వేసి నలుమూలల రాళ్లు నాటాడు. అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితులకు ప్లాట్లు విక్రయించడం ప్రారంభించాడు. రూ.3కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇంత బహిరంగంగా ప్లాట్లు వేసి మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతున్నా అధికారులు ప్రశ్నించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాట్లు వేసి డిప్‌ ద్వారా విక్రయాలు

ఆ 78 సెంట్ల స్థలంలో ఒక్కో ప్లాట్‌ మూడు మూడు సెంట్ల చొప్పున మొత్తం 24 ప్లాట్లు వేశారు. నేరుగా ఒకేసారి రూ.9లక్షలు చెల్లిస్తే మూడు సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని, రూ.50వేలు అడ్వాన్స్‌ చెల్లించిన వారికి ప్లాట్‌ నెంబరును కేటాయిస్తామని. నెలకు రూ.14,500 చొప్పున 70నెలలు చెల్లించాలని కరపత్రాలు ముద్రించాడు. అందులో తన ఫోన్‌ నెంబర్లు వేసి వ్యాపారం ప్రారంభించాడు. ఈ కరపత్రాల్లో సర్వే నెంబరు, ఎక్కడ భూమి అని చూపించలేదు. తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా ప్లాట్లను విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ స్థలం కొనుగోలు చేశానని..

కబ్జాదారుడు కొందరు అనుకూలమైన వ్యక్తులను తాను కబ్జా చేసిన శ్మశాన స్థలం వద్దకు తీసుకెళ్లి ఈ స్థలం తాను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ భూమి తనదేనని, ప్లాట్లు వేసి డిప్‌ సిస్టమ్‌ ద్వారా అమ్మకాలు చేపట్టాడు. ఈ మధ్య కాలంలో ఎస్‌. కొండాపురంలో మృతి చెందిన వ్యక్తిని ఇదే శ్మశాన వాటికలో సమాధి చేశారు. గతంలోనే ఓ వ్యక్తి అక్కడ ప్లాటు కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అంత్యక్రియలకు వెళ్లాక ఆ స్థలాన్ని చూసి అవాక్కయ్యాడు. తనకు ఈ ప్లాట్‌ వద్దని రెండు రోజులు గడిచిన తరువాత శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసిన సొసైటీ డైరెక్టర్‌కు తెలిపాడు. ఆ విధంగా ఈ స్థలం శ్మశాన వాటిక అని బయట పడింది.

మా తాత వాళ్లు వలస వచ్చారు...

మాది తమిళనాడు. 1957లో మా తాతలు ఇక్కడికి వలస వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్నాము. దాదాపు 10 కుటుంబాల్లో 50మంది వరకు ఉన్నాం. రెండేళ్ల క్రితం మా నాన్న గోవిందు, చిన్నమ్మ రాములమ్మ, చిన్నాన్న నల్లస్వాములు అనారోగ్యంతో మృతిచెందితే సర్వే నెం.91లో ఉన్న శ్మశానవాటికలో సమాధులు చేశాం. ఈసమాధులను ఆదోనికి చెందిన ఓ నాయకుడు కబ్జా చేసి రాళ్లు పాతాడు. శ్మశానాన్ని కబ్జా చేస్తే మృతిచెందిన కాలనీ వాసులను ఎక్కడ పూడ్చాలి.

రవికుమార్‌, ఎస్‌.కొండాపురం, ఆదోని

భూకబ్జాదారులపై కేసు నమోదు చేస్తాం

ఎస్‌.కొండాపురంలోని సర్వే నెం.91లో ఉన్న 78సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలను, శ్మశాన వాటికలను కబ్జా చేస్తే కేసు నమోదు చేస్తాం.

శేషఫణి, తహసీల్దార్‌, ఆదోని

Updated Date - Jan 16 , 2026 | 11:48 PM