మార్కెట్ యార్డు కళకళ
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:45 AM
ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు, చుట్టుముట్టు ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి రైతులు తాము పండించిన వేరుశనగను భారీగా విక్రయానికి తీసుకొస్తున్నారు.
15,387 బస్తాల వేరుశనగ రాక
గరిష్ట ధర రూ. 8,290.. కనిష్ట ధర రూ. 3,130
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఎమ్మిగనూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు, చుట్టుముట్టు ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి రైతులు తాము పండించిన వేరుశనగను భారీగా విక్రయానికి తీసుకొస్తున్నారు. వారంలో దాదాపు 23వేల బస్తాలకు పైగా వేరుశనగను విక్రయానికి తీసుకురాగా తాజాగా ఆదివారం 15387 బస్తాలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డు వేరుశనగ రాసులతో కళకళలాడింది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అడపదడప వర్షాలు వస్తుండటంతో వేరుశనగను ఆరుబయట అమ్మకానికి పెడితే తడిసి పోయే అవకాశం ఉంటంతో యార్డు వెనుక భాగంలో పత్తి మార్కెట్‌కోసం ఏర్పాటు చేసిన(ప్రస్తుతం కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ నడుస్తున్న షెడ్లు) జంబో షెడ్డు, రేకుల షెడ్లకింద రైతులు, దుకాణదారులు వేరుశనగను విక్రయానికి ఉంచారు. అయినప్పటికీ వర్షం వస్తే తడిసే అవకాశం ఉండటంతో రైతులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే చిన్నపాటి వర్షంతో వచ్చి నిలిచిపోవటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. హోల్ సేల్ కూరగాయల మార్కెట్‌ను మరోచోటకు మార్చితే తప్ప అటు రైతులకు, ఇటు దుకాణదారులకు, వ్యాపారులకు వర్షం కష్టాలు తప్పెటట్లు కనిపించటం లేదు. వ్యవసాయ మార్కెట్‌కు 382మంది రైతులు 15387 బస్తాలు తీసుకురాగా క్వింటం వేరుశనగ కనిష్ట ధర రూ. 3130లు మధ్యధర రూ. 6745లు, గరిష్ట ధర రూ. 8290లు పలికాయి. అలాగే ఆముదాలు రెండు బస్తాలు రాగ క్వింటం రూ. 5100లు పలికాయి. వేరుశనగ మధ్య ధరతో పాటు గరిష్ట ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులు బోర్లు, బావుల కింద వేరుశనగ పంటను సాగుచేసి మంచి దిగుబడులను సాధిస్తుండటంతో మొన్నటి వరకు వెలవెల బోయిన మార్కెట్ యార్డు కొన్ని రోజులుగా కళకళలాడుతోంది.
మార్కెట్‌లో సౌకర్యాలు కల్పించాలి
మార్కెట్‌యార్డులో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. వర్షం వచ్చినప్పుడు సరుకు తడిసి పోకుండా పెద్ద షెడ్లు వేయించాలి. నేను అమ్మకానికి తెచ్చిన వేరుశనగ క్వింటం రూ. 7699లు ధర పలకటం సంతోషంగా ఉంది. - నరసింహులు, రైతు, కోటేకల్లు