ఇటు’కేసీ’ చూడండి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:04 AM
మండలంలో ప్రవహించే కేసీ కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువకు పూర్గిగా నీరు విడుదల చేసినా ప్రవాహ వేగం తగ్గే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీ కాలువలో గుర్రపు డెక్క, ఉప కాలువల్లో పూడిక ఫ ప్రశ్నార్థకంగా చివరి ఆయకట్టు సాగు
శిరివెళ్ల, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రవహించే కేసీ కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువకు పూర్గిగా నీరు విడుదల చేసినా ప్రవాహ వేగం తగ్గే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు-కడప కాలువ పరిధిలో మండలంలో దాదాపు 12వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువ పరిధిలో అత్యధికంగా వరి సాగుచేస్తారు.
కాలువల్లో గుర్రపుడెక్క, పూడిక
ప్రధాన కాలువలో గుర్రపుడెక్క ఉండగా, పిల్లకాలువల్లో పూడిక, గడ్డి పెరిగి నీరు పారేందుకు అవకాశం లేకుండా ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని లక్షల ఎకరాల భూములకు సాగునీరందించే కేసీ కాలువకు అనుసంధానంగా ఉన్న ఉపకాల్వలు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లేక ఎక్కడ చూసినా పేరాగడ్డి, గుర్రపు డెక్క, జము పేరుకుపోయాయి. దీంతో కేసీ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికూనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, కాలువలో గుర్రపు డెక్క, గడ్డిని తొలగించాలని, పిల్లకాలువల్లో పూడిక తీయించాలని రైతులు కోరుతున్నారు.
కాలువల నిర్వహణ గాలికి..
ప్రతి ఏడాది వేసవిలో కాలువకు నీటి సరఫరా ఆగిపోతుంది. ఆ సమయంలో కాలువ నిర్వహణ పనులు చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పూడిక తీయడం, గుర్రపుడెక్కను తొలగించడం, వ్యర్థాలను తీసివేయడం చేస్తే నీటి ప్రవాహం సాఫీగా అయ్యే అవకాశం ఉంది.
ఉప కాలువల్లో పూడిక తీయాలి
కేసీ కాలువ ఉపకాల్వలో పూడిక తీయాలి. నిర్వహణ లేక కాలువలో పూడిక, పిచ్చి గడ్డి పేరుకుపోయింది. అలాగే ప్రధాన కాలువలో గుర్రపు డెక్క ఉండటంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. కేసీ సాగునీటి ఆధారంగా ఖరీఫ్, రబీ సీజన్లలో విరివిగా వరి సాగు చేస్తున్నాం. ఖరీఫ్ ప్రారంభమయ్యేలోపు అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు పూర్తిచేస్తే రైతులకు మేలు. - వెంకట ప్రసాద్, రైతు, శిరివెళ్ల