Share News

పాడి రైతుకు ప్రభుత్వ అండ

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:19 AM

పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘హరిత గోపాలం’ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుగ్రాసం పెంపకానికి 100శాతం రాయితీ ఇసప్తున్నాయి

పాడి రైతుకు ప్రభుత్వ అండ
రాయితీపై సాగుచేసిన పశుగ్రాసం

కొలిమిగుండ్ల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘హరిత గోపాలం’ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుగ్రాసం పెంపకానికి 100శాతం రాయితీ ఇసప్తున్నాయి. దీంతో పాడి రైతులకు పశుగ్రాసం కరొత తీరడంతోపాటు, పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశఉమంది. బీడు భూముల్లో సేద్యం మొదలుకొని, విత్తనాలు, ఎరువులకు అవసరమైన నిధులు ప్రభుత్వమే ఇస్తుంది.

ఎక్కడ సంప్రదించాలి?

పశుగ్రాసం పెంచేందుకు ఆసక్తిగల రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలి. లేదా సమీపంలోని పశు వైద్యశాలలో సంప్రదించి కావాల్సిన పత్రాలు అందజేసి ఈపథకం లబ్దిని పొందవచ్చు.

నిబంధనలు

అయిదు ఎకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు ఈపథకానికి అర్హులు. అయితే సదరు రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు కలిగి ఉండాలి. రైతులు వ్యక్తిగతంగా పశుగ్రాసం పెంచుకోవడానికి, స్వయం సహాయక సంఘాల ద్వారా పశుగ్రాసం పెంపకంతో పాటు, పశుగ్రాస నర్శరీల ఏర్పాటుకు సైతం ఈపథకం ద్వారా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే కనీసం రెండు పశువులు ఉండాలి, అలాగే 25సెంట్ల స్థలంలో పశుగ్రాసాన్ని సాగు చేయవచ్చు, ఇందుకు ప్రభుత్వం రూ.14500 వరకూ అందజేస్తుంది. అలాగే 5 పశువులు కలిగిన రైతు 50సెంట్లలో సాగు చేస్తే రూ.29000, 5 పశువులకు పైబడితే ఎకరా విస్థీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండగా వీరికి రూ.56500 అందజేస్తారు. మరోవైపు స్వయం సహాయక సంఘాలకు 5ఎకరాల విస్థీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండగా రూ.1,05,016 రాయితీ అందిస్తారు.

పాడి రైతులు వినియోగించుకోవాలి

హరిత గోపాలం పథకం పాడి రైతులకు వరం. ప్రతి రైతూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి పథకం జాబ్‌కార్డు, భూమి హక్కు పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకంతో పశు వైద్య సిబ్బందిని సంప్రదించాలి. - డాక్టర్‌ రామ్‌కుమార్‌రెడ్డి, పశువైద్యాధికారి

Updated Date - Jun 21 , 2026 | 12:19 AM