Share News

‘గ్రీన్‌ కో’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:06 AM

అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సంస్థ చేసిన ప్రాజెక్టు అద్భుతమని కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్జ్‌ అన్నారు. సోమవారం మండలంలోని పిన్నాపురం, గుమితంతండా సమీపంలో ఉన్న గ్రీన్‌కో పవర్‌ ప్రాజెక్టు, పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు.

‘గ్రీన్‌ కో’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
మాట్లాడుతున్న కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి జార్జ్‌

కర్ణాటకలో 3వేల మెగా వాట్ల ప్రాజెక్టుకు రూపురేఖలు

కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్జ్‌

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సంస్థ చేసిన ప్రాజెక్టు అద్భుతమని కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్జ్‌ అన్నారు. సోమవారం మండలంలోని పిన్నాపురం, గుమితంతండా సమీపంలో ఉన్న గ్రీన్‌కో పవర్‌ ప్రాజెక్టు, పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సౌర పవర్‌ విద్యుత్‌ పగటి పూట విస్తృతంగా లభిస్తోందన్నారు. అయితే అధిక వినియోగ సమయాల్లో నిల్వ వ్యవస్థల కోత కారణంగా సరఫరా లోటు ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితులను పంప్‌ స్టోరేజీ సాంకేతిక సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పగటిపూట లభించే విద్యుత్‌ను వినియోగించి నీటిని ఎత్తయిన ప్రాంతాలకు పంపించి అవసరమైన సమయంలో తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా నిరంతర సరఫరా సాధ్యమవుతుందని వివరించారు. గ్రీన్‌ కో సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో వినూత్న సాంకేతికలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అభినందించారు. కర్ణాటకలోని షరావతి రిజర్వాయర్‌ వద్ద సుమారు 3వేల మెగా వాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 18వేల మెగా వాట్లకు చేరుతుందని సౌశక్తి ప్రాంతంలోనే మరో ప్రాజెక్టు ప్రాథమిక దశలో కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి దిశగా తీసుకెళ్తామన్నారు. తుముకూరు జిల్లా పావగడ సోలార్‌ పార్కు విజయవంతమైందన్నారు. ఈ ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావడం పునరుత్పాదక ఇంధన రంగానికి అనుకూల సంకేతమని పేర్కొన్నారు. సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్‌ గుప్తా, రెన్యువబుల్‌ ఎనర్జీ చైర్మన్‌ రాజేగౌడ, గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో చలమశెట్టి అనిల్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసులు నాయుడు, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, గ్రీన్‌కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:06 AM