ప్రత్యూషకు పచ్చజెండా!
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:28 AM
టీడీపీలో చైర్మన్ అభ్యర్థుల కొలిక్కి వచ్చింది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.
మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఆదోని చైర్పర్సన్ అభ్యర్థిగా నాగమణి
ఎమ్మిగనూరుపై కొనసాగుతున్న ఉత్కంఠ
కర్నూలు, ఎమ్మిగనూరుకు వైసీపీ ప్రకటన
రేపటితో నామినేషన్లు గడువు ముగింపు
గూడూరు, ఆదోనిలో రెబల్ భయం?
కర్నూలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీలో చైర్మన్ అభ్యర్థుల కొలిక్కి వచ్చింది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కర్నూలు మేయర్ అభ్యర్థినిగా అందరూ ఊహించినట్లే బొల్లెద్దుల కుటుంబానికి చెందిన విజయ ప్రత్యూష ఎంపికయ్యారు. అదేవిధంగా పెద్ద మున్సిపాలిటీగా పేరొందిన ఆదోనికి నాగమణి పేరును ఖరారు చేశారు. ఈమె ఆదోని టీడీపీ ఇన్చార్జి కె.మీనాక్షి నాయుడు సోదరి కుమార్తె. నాగమణి తండ్రి బలరాం చౌదరి టీడీపీలో చురుగ్గా కొనసాగుతున్నారు. ఇక ఎమ్మిగనూరుకు ఎవరన్నది టీడీపీ నిర్ణయించలేదు. బీజేపీకి గూడురు నగరపంచాయతీ కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి కూడా శనివారం మధ్యాహ్నం లోగా ప్రకటన రానుంది.
ఎమ్మిగనూరు ఎవరికి?
ఎమ్మిగనూరు చైర్మన్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి చేనేత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్ కుమార్ పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఎంజీ కుటుంబానికి చెందిన టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని సోమ్‌నాథ్ కూడా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరిగింది? అన్న చర్చ జరుగుతోంది.
చైర్మన్లకు నాలుగు.. కౌన్సిలర్లకు 27
కర్నూలు మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు చైర్మన్లతో పాటు 187 కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శుక్రవారం కర్నూలు కార్పొరేషన్లో కార్పొరేటర్లకు 12 నామినేషన్లు వచ్చాయి. మేయర్ అభ్యర్థిగా అన్న వైఎ్‌సఆర్ పార్టీ నుంచి మీనాకుమారి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కార్పొరేటర్లుగా టీడీపీ నుంచి 8, సీపీఎం 1, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఆదోని మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్లకు వైసీపీ నుంచి ఐదు, టీడీపీ నుంచి నాలుగు, బీజేపీ నుంచి మూడు నామినేషన్లు వచ్చాయి. చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన నియోజకవర్గపు ఇన్చార్జి ఎన్. మల్లప్ప భార్య ఎన్. స్వప్న నాయకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు నుంచి కౌన్సిలర్లకు వైసీపీ నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి. గూడూరులో టీడీపీ నుంచి ఒకరు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆదివారంతో నామినేషన్ల గడువు ముగియనుంది.
బలం లేని పార్టీకి..
గూడూరు నగర పంచాయతీ చైర్మన్ పీఠాన్ని సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ డమామ్ సురేశ్ భార్య డమామ్ సునీతాబాయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు సన్నద్ధమవుతున్నారు. అధిష్ఠానం తమతో ఏ మాత్రం సంప్రదించకుండా బలంలేని బీజేపీకి చైర్మన్ పీఠం కేటాయించడంపై స్థానిక టీడీపీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం నిర్ణయాన్ని..
గూడూరు చైర్మన్ పీఠం బీజేపీకి ఇస్తే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థిని బరిలో దించాలని ఆపార్టీ నాయకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రెబల్‌గా చైర్మన్‌తో పాటు 23వార్డు కౌన్సిలర్లకు టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నద్ధ్దమైనట్లు సమాచారం. కూటమి పొత్తు ధర్మం, సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని దిక్కరించి రెబల్‌గా బరిలో దిగుతారా? పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తారా? అన్నది తేలాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. శనివారం టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రెండు స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ఖరారు
కర్నూలు మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థినిగా యు.సుశీల, ఎమ్మిగనూరు చైర్మన్ అభ్యర్థిగా కె.శివన్న రఘులను ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
కూటమి పార్టీల మధ్య పంపకాలు
గురువారం కూటమి పార్టీల మధ్య చైర్మన్ సీట్ల పంపకాలు జరిగాయి. కర్నూలు మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్లు టీడీపీకి కేటాయించగా, గూడూరు నగర పంచాయతీ చైర్మన్ పీఠం బీజేపీకి దక్కింది. చివరి రోజు ఆదివారం శుభ ముహూర్తం బలంగా ఉండడంతో ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గూడూరు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ స్థానిక నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఇక్కడి నుంచి రెబల్‌గా అభ్యర్థిని బరిలోకి దింపేందుకు తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పీఠం ఆశించిన జనసేన ఆదోని నియోజకవర్గం ఇన్చార్జి ఎన్.మల్లప్ప భార్య స్వప్న నాయకర్‌కు సీట్ల పంపకాల్లో నిరాశ ఎదురవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.