Share News

శనగ సాగు ప్రశ్నార్థకం..?

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:53 PM

నవంబరు నెలలో ఎటుచూసినా పచ్చగా శనగ పంటతో కళకళలాడాల్సిన పొలాలు బీడుగా మారాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సీజన్‌ వెళ్లిపోగా, రబీలోనైనా శనగతో గట్టెక్కుదామన్న రైతు ఆశలు నిరాశగా మారే అవకాశం ఉంది. నవంబరు 15లోపు వర్షం కురవకపోతే ఇక శనగ కష్టమేనని వ్యవసాయాధికారులు అంటున్నారు.

శనగ సాగు ప్రశ్నార్థకం..?
సంజామల వద్ద బీడుగా మారిన పొలం

పత్తాలేని వర్షాలు, వాతావరణంలో వేడి..

ఇప్పటికీ సాగుకాని శనగ

15 వరకే అవకాశం..

సంజామల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అర్నబ్‌ తుఫాన్‌ ధాటికి వరదలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి అయితే మండలంలో మాత్రం చినుకు జాడ లేదు. దీంతో రబీ సాగు చేసే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

వేడి వాతావరణంతో దెబ్బ

ఎల్‌నినో ప్రభావంతో చలికాలంలోనూ వేడి వాతావరణం ఉండటంతో శనగ సాగుకు అనుకూల పరిస్థితులు లేవు. నవంబరు నెల వచ్చినా వాతావరణం వేడిగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 44వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఒక్క రబీలోనే 30వేల ఎకరాలకు పైబడి శనగ సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో శనగ సాగుకు అనుకూలం. కాగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో శనగ రైతులు శనగ సాగుపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. అక్టోబరు నెలలో కేవలం 48 మి.లీ వర్షపాతమ నమోదు కావడం, నవంబరు 15లోపు శనగ విత్తనాలు వేయలేకపోతే సాగు కష్టమేనని రైతులు వాపోతున్నారు. శనగతో పచ్చగా కళకళలాడే వ్యవసాయ భూములు బీడుగా మారాయని రతులు అంటున్నారు. ఎస్సార్బీసీ కాలువలో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

అక్టోబరు, నవంబరు నెలల్లో కురవని వాన

సాధారణంగా ఏ సంవత్సరంలోనైనా అక్టోబరు మాసంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కాగా ఈ ఏడాది మాత్రం చినుకజాడ లేదు. దీంతో పంటలు సాగుకు నోచుకునే అవకాశం లేదు. ఈ నెల 15వ తేదీలోపు వర్షం కురవకపోతే ఇక శనగ సాగు కష్టమేనని వ్యవసాయాధికారులు అంటున్నారు.

ఈ ఏడాది కరువే

మండలంలో ఈ ఏడాది కరువు వచ్చింది. ఏటా 10 ఎకరాల్లో శనగ సాగుచేసే వాడ్ని. వర్షాలు కురువకపోవడంతో రబీలో శనగ సాగుచేసే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది పొలాలను బీడుగా వదలాల్సిందే. - ఖాజా మొహిద్దీన్‌, రైతు, సంజామల.

ఇప్పటికే ఎరువులు వేశాను

వర్షం వస్తుందనే ఆశతో పది ఎకరాల్లో శనగ సాగుచేసేవాడిని. ఈ ఏడాది కూడా శనగ సాగు చేసేందుకు ముందుగానే ఎరువులను వేశాను. పది రోజుల్లోపు వర్షం కురవకపోతే ఎరువుల కోసం పెట్టిన ఖర్చును నష్టపోయే ప్రమాదం ఉంది. - శ్రీనివాసులు, రైతు, సంజామల.

Updated Date - Nov 09 , 2026 | 11:53 PM