Share News

ఉత్తరారాధనలో మహా రథోత్సవం

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:20 PM

తుంగాతీరంలో భక్తులు ఆధ్యాత్మిక పరవశం పొందారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాల్లోని ఐదో రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

ఉత్తరారాధనలో మహా రథోత్సవం
మహా రథోత్సవం

పులకించిన తుంగా తీరం

లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనవాహిని

మంత్రాలయం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తుంగాతీరంలో భక్తులు ఆధ్యాత్మిక పరవశం పొందారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాల్లోని ఐదో రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తారాధనలో భాగంగా సోమవారం మహా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూల బృందావనానికి విశేష పూజలు చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. వజ్ర వైడూర్య రత్నాలతో పొదిగిన హారం, బంగారు ఆభరణాలతో అలంకృతుడైన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత పాఠశాల వరకు ఊరేగించి తిరిగి శ్రీమఠానికి తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పూజలు చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. వసంతోత్సవంలో భాగంగా పీఠాధిపతి మఠం అర్చకులు, మఠం సిబ్బంది, భక్తులపై రంగులు చల్లుతూ ఉల్లాసంగా, ఉత్సాహంతో ముందుకు సాగారు. ఉత్సవమూర్తిని రథంపైకి ఆహ్వానిస్తుండగా.. లక్షలాది మంది భక్తులు జయహో గురు రాఘవేంద్ర.. విజయహో అంటూ పెద్ద ఎత్తున జయధ్వానాలు పలికారు. రథం శ్రీమఠం మహా ముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌ మార్మోగింది. అనంతరం శ్రీమఠానికి చేరుకున్న మహారథం నుంచి ఉత్సవమూర్తిని బృందావనం ముందు ఉంచి పూజలు చేశారు. పీఠాధిపతి మహామంగళహారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి మూలరాములకు పూజలు చేశారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో పండిత కేసరి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, మఠం దివాన్‌ సుజయీంద్రాచార్‌, శ్రీనాథ్‌ ఆచార్‌, గౌతమాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, శ్రీపతి ఆచార్‌ పాల్గొన్నారు.

రథోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు

రథోత్సవాల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్ణాటక రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎల్‌ మూర్తి, కర్ణాటక మాజీ మంత్రి అరవింద్‌ లింబావలి, మూలరాముల వంద గదులను నిర్మించి విరాళంగా ఇచ్చిన దాత సోమశేఖర్‌, హెలికాప్టర్‌ పూలవర్షం కురిపించిన దాత బెంగుళూరు కిరణ్‌ కుమార్‌, టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ పన్నగ వెంకటేశ్‌ స్వామి, పూజారి వ్యాసరాజాచార్‌, గోపాలకృష్ణ స్వామి, బీసీ సెల్‌ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అమర్‌ నాథ్‌ రెడ్డి, రాకేష్‌ రెడ్డి, రాజారెడ్డి, విజయరామిరెడ్డి, వరదరాజు, బెస్త చిన్న భీమా, కర్నూల్‌ ఏఎస్పీ హుస్సేన్‌ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పాల్గొన్నారు. 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, కుమారుడు బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సోమవారం రాత్రి రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.

అలరించిన నృత్యాలు

రాఘవేంద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు మహారథోత్సవంలో భాగంగా యోగీంద్ర కళామండపంలో సోమవారం రాత్రి బెంగుళూరుకు చెందిన పుప్పాంజలి నాట్యకళ బృందం భరతనాట్యం, హిందుస్థానీ సంగీతం, హరిహరన్‌ వారిచే భరతనాట్యం భక్తులను అలరించాయి.

భక్తుల కోర్కెలు తీర్చే రాఘవేంద్రుడు

ఐదు భాషల్లో సందేశమిచ్చిన పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు

రాఘవేంద్ర స్వామి యోగనిద్రలో ఉంటూ.. భక్తుల కోరికలు తీరుస్తుంటారని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. మహారథంపై నుంచి భక్తులకు అభివాదం చేస్తూ, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడారు. 355వ సప్తరాత్రోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్తరాధనలో భాగంగా మహారథంపై నుంచి తన దివ్య సందేశాన్ని భక్తులకు వినిపించారు. నేపాల్‌ దేశంలో వరదలకు అతలాకతలమైందని శ్రీమఠం భారీ ఎత్తున ఆదుకుంటుందని తెలిపారు. ఈఏడాది సరైన వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఈలాంటి సమయాల్లో రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. మంత్రాలయం గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ఇన్నర్‌, ఔటర్‌, రింగ్‌రోడ్లు, బైపాస్‌ రోడ్లు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని అన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:20 PM