వైభవంగా ఏరువాక
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:32 PM
ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
కృషి విజ్ఞాన కేంద్రం వేడుకల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులు
రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే పార్థసారథి
ఎమ్మిగనూరురూరల్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జేసీ నూరుల్‌కమార్, ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరితో పాటు ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా కృషి విజ్ఞాన కేంద్రంలోని పొలంలో పూజలు నిర్వహించి వృషభాలతో కుంటికపోసి విత్తనాన్ని సాగుచేశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంద స్టాళ్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నా రైతులందరికి మేలు జరగాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా అమలు చేస్తున్నాయని అన్నారు. రైతులందరికీ అవసరమైన యూరియాను అందజేస్తున్నాయని అన్నారు. యూరియా, డీఏపీ ధరలు అధికంగా ఉన్నప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖర్చును భరించి రైతన్నలకు తక్కువ ధరలకే అందజేస్తుందన్నారు. ఎల్‌నిలో పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పంటలను రైతులు సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని దాదాపుగా తగ్గించాలన్నారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించి, రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఏడీఏ మహ్మద్‌ఖాద్రి, ఏవో శివశంకర్, మాజీ ఎంపీపీ శంకరయ్య, కె.తిమ్మాపురం రంగయ్య, అంపయ్య, ఉద్యాన శాఖ, పశుసంవర్థక శాఖ అధికారులతో పాటు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.