Share News

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:24 AM

మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం
ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలానికి ఏర్పాటు చేసుకున్న హద్దులు

ఫ పట్టించుకోని అధికారులు

ఎమ్మిగనూరు,మార్చి 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్‌ పాఠశాల, మారెమ్మ ఆలయం సమీపం నుంచి గ్రామ శివారు వరకు దాదాపు ఐదు ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలం ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండటంతో కొందరు వాముదొడ్లకు వాడుకునేవారు. ఇటీవలే కాలంలో ఏకంగా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు తమకు అవసరమైన మేరకు స్థలాన్ని ఆక్రమించుకొని హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంబందిత అధికారులు పరిశీలనకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఉన్నత పాఠశాలకు ప్రభుత్వ స్థలం కరువు

కే తిమ్మాపురం గ్రామానికి రెండేళ్ల క్రింతం జడ్పీ ఉన్నత పాఠశాల మంజూరైంది. అధికారులు స్థలం చూపకపోవడంతో ఉన్నత పాఠశాలను యూపీ పాఠశాలలో నిర్వహించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న యుపీ పాఠశాలలోనే నిర్మించేందుకు స్థలం సరిపోకపోవటం పాఠశాలపై అంతస్తులో నిర్మాణం చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు నిరాకరించారు. దీంతో ఉన్నతపాఠశాల భవన నిర్మాణం ఏర్పాటుకు నోచుకోలేదు.

నిర్మాణానికి నోచుకోని విలేజ్‌ క్లినిక్‌

గ్రామ ప్రజలకు వైద్యసేవలందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కే తిమ్మాపురంలో విలేజ్‌ క్లినిక్‌ను మంజూరు చేసింది. దీనికి సైతం స్థలం చూపకపోవటంతో విలేజ్‌ క్లినిక్‌ కూడా నిర్మాణానికి నోచుకోవటం లేదు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఉండికూడా ప్రజలకు ఎంతో అత్యవసరమైన విద్య, వైద్యం అందించే భవనాలకు స్థలాలు చూపలేని పరిస్థితుల్లో సంబంధితశాఖల అధికారులు విఫలం కావటం విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించం

కే.తిమ్మాపురంలో ప్రభుత్వ ఆక్రమిస్తే ఉపేక్షించం. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి వెళ్లి పరిశీలించాం. స్థలాన్ని సర్వేచేయాలని సర్వేయర్‌కు ఆదేశాలిచ్చాం. సర్వే చేశాక ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగిస్తాం. జడ్పీ ఉన్నత పాఠశాలకు స్థలం విషయం ఆశాఖ నుంచి మాకు సమాచారం రాలేదు. - శ్రీనివాసులు, ఇన్‌చార్జి తహసీల్దార్‌, ఎమ్మిగనూరు

Updated Date - Mar 30 , 2026 | 12:24 AM