ప్రభుత్వ భూమిపై కన్ను
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:13 AM
పట్టణ పరిసరాల్లో భూ ఆక్రమణదారులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు... రికార్డులు మార్చేయడం, రాత్రికిరాత్రే వెంచర్లు వేసేయడం పరిపాటిగా మారింది. తాజాగా శుక్రవారంపేట పర్వతాపురం గ్రామ పరిధిలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ రస్తా పరంబోకు భూమిపై వైసీపీ నాయకుల కన్ను పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆదోనిలో వైసీపీ నాయకుల నిర్వాకం
అధికారుల అండతో రికార్డుల మాయాజాలం
అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
ఆదోని, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిసరాల్లో భూ ఆక్రమణదారులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు... రికార్డులు మార్చేయడం, రాత్రికిరాత్రే వెంచర్లు వేసేయడం పరిపాటిగా మారింది. తాజాగా శుక్రవారంపేట పర్వతాపురం గ్రామ పరిధిలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ రస్తా పరంబోకు భూమిపై వైసీపీ నాయకుల కన్ను పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారంపేటలోని సర్వే నంబర్ 314లోని 3.30 ఎకరాల భూమి ఆర్‌ఎ్‌సఆర్ రికార్డుల ప్రకారం’ ప్రభుత్వ రస్తా పరంబోకు’. అంటే ఇది ప్రజలందరికీ చెందాల్సిన దారి. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారబలంతో ఒక వైసీపీ నాయకులు, అప్పటి అధికారులను మచ్చిక చేసుకుని ఈ భూమిని తమ బంధువుల పేరిట మార్పించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‘ఫ్రీ హోల్డ్’ చేయించుకుని, ఆపై ప్లాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ హోల్డ్ భూములను తిరిగి హోల్డ్‌లో ఉంచాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆదోనిలోని కొంతమంది అధికారులు పాత అలవాట్లను మానుకోకుండా వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మారినా, క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో బీజేపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం..
బుధవారం శుక్రవారంపేటలోని వివాదాస్పద భూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని భూమిని పరిశీలిస్తుండగా వైసీపీ నేత వెంచర్ యజమాని తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. మేము ఈ భూమిని రూ.82 లక్షలకు కొనుగోలు చేశామని, తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటూ ఆయన వివరించారు. ప్రభుత్వ రస్తా పరంబోకు భూమిని అమ్మే హక్కు ఎవరికి ఉంది..? తప్పుడు రికార్డులతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని ఎలా కాజేస్తారు...? ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య గంటసేపు వాగ్వాదం కొనసాగింది.
ఎక్కడ చూసినా ఆక్రమణలే..
ఆదోని నియోజకవర్గవ్యాప్తంగా ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలను, చెరువు పోరంబోకులను ఆక్రమిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పక్కదారి పట్టించడం, వాగులు, వంకలను పూడ్చివేసి అక్రమ వెంచర్లు వేయడం, అధికారులను బెదిరించి లేదా ప్రలోభాలకు గురిచేసే రికార్డులు తారుమారు చేయడం, ఇలాంటి ఉదంతాలు జిల్లావ్యాప్తంగా నిత్యకృత్యమయ్యాయని, ఆదోనిలో ఈ 3.30 ఎకరాల భూమి కేవలం మచ్చుతునక మాత్రమేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
తక్షణమే విచారణ జరపాలి....
ప్రభుత్వ భూములను కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎన్‌డీఏ కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు. సర్వే నంబర్ 314పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై తహసీల్దార్ శేషఫణిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా..... తనను ఏమీ అడగవద్దని, తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని, రెండు రోజులు ఆగితే తప్పా నేనేమి చెప్పలేనని అన్నారు. పట్టానా? ప్రభుత్వ భూమినా? అని అడిగినా.. తన దగ్గర ఎలాంటి సమాచారం లేదు. వీఆర్వోని, ఆర్‌ఐని అడిగి తెలుసుకుని పూర్తి వివరాలు తెలుసుకున్న వెంటనే మీకు సవనీయంగా తెలియపరుస్తానంటూ సమాధానమిచ్చారు.