అన్నదాతలకు శుభవార్త
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:11 PM
అన్నదాతలకు కేంద్రం శుభవార్త అందించింది. 22వ విడత రైతులకు అందించాల్సిన రూ.2వేలను ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈనెల 13న రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ డబ్బులు
ఉమ్మడి జిల్లాలో 4.80 లక్షల మంది రైతులకు లబ్ధి
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు కేంద్రం శుభవార్త అందించింది. 22వ విడత రైతులకు అందించాల్సిన రూ.2వేలను ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. కర్నూలు జిల్లాలో 2,72,757 మంది రైతులకు, నంద్యాల జిల్లాలో 2,06,052 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2వేల ప్రకారం రైతులకు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.
నిధులపై రాని క్లారిటీ
కూటమి ప్రభుత్వం పంట సాగుకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తోంది. కేంద్రం అందిస్తున్న సంవత్సరానికి రూ.6వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి రూ.14వేలు అందించేందుకు చర్యలు చేప ట్టింది. ఇప్పటికీ రెండు విడతల్లో ఒక్కో విడత రూ.5వేల ప్రకారం అందజేసింది. మూడో విడత త్వరలోనే రూ.4వేలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద మొదటి, రెండో విడతల్లో రూ.365.44కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. నంద్యాల జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి, రెండో విడతల కింద రూ.280.28 కోట్లు విడుదల చేశాయి. ప్రస్తుతం మూడో విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసే మొత్తంతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందో లేక విరివిగా మరోసారి విడుదల చేస్తుందో లేదో అధికార వర్గాలు చెప్పలేక పోతు న్నాయి. ఈ పథకంలో ఎలాంటి సమస్యలున్నా రైతులు సమీప వ్యవసాయ కార్యాలయం, గ్రామాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదిం చాలని జేడీ రైతులకు విజ్ఞప్తి చేశారు.