పల్లెకు నీళ్లివ్వరా?
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:19 AM
తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న పల్లెలకు నీళ్లు ఇవ్వరా అని పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కేఈ శ్యాంబాబు ప్రశ్నించారు. వీరు హంద్రీనీవా ద్వారా నీటి విడుదలపై గురువారం కలెక్టర్ డాక్టర్ ఎ. సిరితో చర్చించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
తక్షణం హంద్రీ నీవా నీరు విడుదల చేయాలి
గాజులదిన్నె ప్రాజెక్టును, 74 చెరువులను నింపాలి
కలెక్టర్‌తో పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కేఈ శ్యాంబాబు
కర్నూలు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న పల్లెలకు నీళ్లు ఇవ్వరా అని పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కేఈ శ్యాంబాబు ప్రశ్నించారు. వీరు హంద్రీనీవా ద్వారా నీటి విడుదలపై గురువారం కలెక్టర్ డాక్టర్ ఎ. సిరితో చర్చించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పత్తికొండ, డోన్, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో 74 చెరువులు నింపేందుకు 1.238 టీఎంసీలు తీసుకోవడానికి అనుమతి ఉందని, రోజుకు 150 క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉంటే, హంద్రీ నీవాకు కృష్ణా జలాలు ఎత్తిపోత మొదలు పెట్టి 20 రోజులు దాటినా చెరువులకు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని అడిగారు. గాజులదిన్నె జలాశయానికి మూడు టీఎంసీలు వాటా కేటాయించినా తూములు ఎత్తి ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. కల్లూరు మండలంలో హంద్రీ నది తీరంలోని 8 గ్రామాల ప్రజల తాగునీటికి హంద్రీనే ఆధారమని, నది ఒట్టిపోవడంతో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తింది.. తక్షణం లద్దగిరి, కృష్ణగిరి తూములు ఎత్తి హంద్రీ నదికి నీరు విడుదల చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గట్టిగా డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ తాగునీటికి ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 74చెరువులకు నీరు విడుదల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ వివరించారు. అదే సమయంలో ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శిశి భూషన్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేయకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. రెండు మూడు రోజుల్లో నీటి విడుదలపై సముచిత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యేలకు మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. జలవనరుల శాఖ కర్నూలు ఎస్‌ఈ శైలేశ్వర్, హంద్రీ నీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్-1 ఎస్‌ఈ రాజన్‌బాబు, పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ నబిరసూల్ పాల్గొన్నారు.