Share News

‘ఎస్సీ హోదా కల్పించాలి’

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:30 AM

ఎస్సీ క్రైస్తవులు, ముస్లింల హక్కులను కాలరాయొద్దని, వారికి ఎస్సీ రిజర్వేషన్‌ కల్పించాలని పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు.

‘ఎస్సీ హోదా కల్పించాలి’
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న దళిత క్రైస్తవులు

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ క్రైస్తవులు, ముస్లింల హక్కులను కాలరాయొద్దని, వారికి ఎస్సీ రిజర్వేషన్‌ కల్పించాలని పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు. కర్నూలు క్యాథలిక్‌ డయోసిస్‌ ఫాదర్లు డేవిడ్‌ అర్లప్ప, జోజిరెడ్డి, ప్రతాపరెడ్డి, లహస్త్రాయ, థామస్‌, ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. 76సంవత్సరాలుగా దేశంలో నివసిస్తున్న ఎస్సీలు క్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరిస్తే వారి ఎస్సీ హోదా రద్దు అవుతోందని, దీనివల్ల ఎస్సీలుగా అవకాశాలు కోల్పోయి, సామాజికంగా కుల వివక్షను అనుభవిస్తూ అనేక రకాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులలోని 3వ పేరాను తొలగించి ఎస్సీ క్రైస్తవ, ముస్లీంలకు ఎస్సీ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కులం వేరు, మతం వేరు అని.. కులం సామాజికమైనదని, మతం ఆధ్యాత్మికమైందన్నారు. మతం మారినంత మాత్రాన షెడ్యూల్డు కులాల వారిలో ఎలాంటి సామాజిక, ఆర్థిక పురోగతి కనిపించలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కమిషన్లు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో ఉన్న జేసీ నూరుల్‌ ఖమర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో క్యాథలిక్‌ ఎస్సీ, బీసీ కమిషన్‌ సభ్యులు చార్లెస్‌, సత్యరాజు, మోజెస్‌, ఇతర క్రైస్తవ సంఘాల నాయకులు, సిస్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:35 AM