విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:11 AM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని జడ్పీ సీఈవో, మండల స్పెషల్ ఆఫీసర్ నాసరరెడ్డి సూచించారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఓర్వకల్లులో జడ్పీ సీఈవో, మండల స్పెషల్ ఆఫీసర్ నాసరరెడ్డి సుడిగాలి పర్యటన
ఓర్వకల్లు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని జడ్పీ సీఈవో, మండల స్పెషల్ ఆఫీసర్ నాసరరెడ్డి సూచించారు. గురువారం ఆయన ఓర్వకల్లులో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఓర్వకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. స్టాక్ రూమ్‌ను, రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు ఎండలో నిలబెట్టకుండా వరండాల్లో భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదులు, మరుగుదొడ్లు, తాగునీరు మొదలైన వాటిని పరిశీలించారు. వసతి గృహంలో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే సచివాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ అధికారులతో ఓర్వకల్లులో చేపడుతున్న ఇంటింటి సర్వేపై ఆరా తీశారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారాన్ని, రికార్డులను, స్టాక్‌ను పరిశీలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో నాగ అనుసూయ, ఎంఈవోలు ఓంకార్ యాదవ్, రాంభూపాల్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో శాంతన్న, హౌసింగ్ ఏఈ శ్రీనాథ్ పాల్గొన్నారు.