Share News

ఘోరకల్లు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:58 PM

ఘోరకల్లు..

ఘోరకల్లు..
తెగిన ఎస్సార్బీసీ రక్షణ కట్ట

గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తిన ఓటీ రెగ్యులేటర్‌

గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్సార్బీసీ ఎక్కి పారిన నీళ్లు

గ్రామంలోకి చేరిన వరద

భయంతో కొండెక్కిన గ్రామస్థులు

దాదాపు 6వేల క్యూసెక్కుల నీరు బయటికి

తెగిన కాల్వ కట్ట రక్షణ బండ్‌

పరిశీలించిన కలెక్టరు, ఎమ్మెల్యే,

పాణ్యం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గోరుకల్లు రిజర్వాయర్‌ వద్ద జరిగిన ఘటనతో గ్రామస్థులు భయాందోళన చెందారు. గోరుకల్లు రిజర్వాయర్‌ ఔట్‌ ఫాల్‌ రెగ్యులేటర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తారు. గేట్లు ఎత్తడంతో ఒకేసారి దాదాపు ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎస్సార్బీసీ కాల్వకు చేరింది. రెండు వేలకు మించి ప్రవహించని కాల్వకు ఒకేసారి నీరు పెద్ద ఎత్తున చేరడం తో నీరు కాల్వ పైనుంచి కిందకు ప్రవహించింది. ఈ సమ యంలో కాల్వకు రక్షణగా నిర్మించిన కట్ట ఒకేసారి మూడు చోట్ల తెగిపోవడంతో నీరు గోరుకల్లు గ్రామంలోకి చేరింది. ఉదయం 5గంటల సమయంలో గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గ్రామ సమీపంలోని వేణుగోపాల స్వామి కొండపైకి పరుగులు తీశారు.

రెండు అడుగుల మేర నీరు చేరి..

గ్రామంలో రెండు అడుగుల మేర నీరు చేరి గ్రామం బురద మయంగా మారింది. నీటి ప్రవాహంతో కాల్వ రక్షణ కట్ట తెగి పెద్దపెద్ద బండరాళ్లు నీటి ప్రవాహానికి కొట్టుకొని గ్రామం లోకి చేరాయి. గోరుకల్లు, కొండజూటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సమీప పంట భూములు ముంపునకు గురయ్యా యి. కాల్వలో పెద్దపెద్ద రాళ్లు చేరాయి. గ్రామంలోని పశువులను నీటిలో మునగకుండా కాపాడుకున్నారు. ఎస్సార్బీసీ అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవేళ ఎస్సార్బీసీ కాల్వ కట్ట తెగితే సమీప గోరుకల్లు గ్రామంతో పాటు సాబ్జహాన్‌ కొట్టాల గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని పలువురు పేర్కొంటున్నారు.

గేట్లు ఎలా ఎత్తారన్నది..

గోరుకల్లు రిజర్వాయర్‌ ద్వారా నీరు బయటికి ఎస్సార్బీసీ కాల్వకు విడుదల చేయాలంటే సాంకేతిక నిపుణులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు గేట్లు ఎలా ఎత్తారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. రిజర్వాయర్‌ వద్ద నిత్యం ఇద్దరు లస్కర్లు విధులు నిర్వహిస్తుంటారు. వీరు గేట్ల పర ్యవేక్షణ చేస్తుంటారు. మంగళవారం ఉదయం వర్షం కారణంగా సమీపంలోని షెల్టరు వద్దకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేట్లు ఎత్తారని పలువురు పేర్కొంటున్నారు. గేట్లు ఎత్తడానికి అవసరమైన తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఎలా వెళ్లాయన్నది పలువురి ప్రశ్న.

పెద్ద ప్రమాదం తప్పింది

దాదాపు 45 నిమిషాల సేపు రిజర్వాయర్‌ నీరు ప్రవహించింది. దీంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామంలోకి క్రమంగా నీరు చేరుతుండడంతో కొందరు గ్రామస్థులు అప్రమత్తమ య్యారు. వెంటనే ఎస్సార్బీసీ అధికారులకు సమాచారం అందించారు. వారు తక్షణమే అక్కడికి చేరుకొని గేట్లు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం

గోరుకల్లులో జరిగిన సంఘటనను తెలుసుకున్న వెంటనే కలెక్టర్‌ రాజకుమారి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తెగిన రక్షణ కట్టలు, దెబ్బతిన్న పంట భూములు పరిశీలించారు. ఓటీ రెగ్యులేటర్‌ ప్రాంతాన్ని పరిశీలించి ఎస్సార్బీసీ అధికారులతో చర్చించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు చోట్ల నీరు కాల్వను ఎక్కిపారడంతో మూడు చోట్ల రక్షణ కట్ట పూర్తిగా ధ్వంసమైందన్నారు. సంఘటన కారకులపై కఠినంగా వ్యవహరిస్తామ న్నారు. రిజర్వాయర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామంలో రక్షణ సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టి సాధారణ స్థితికి తీసుకువస్తామన్నారు. నీరు ప్రవహించడంతో గ్రామమంతా బురదగా మారండంతో సహాయక చర్యలపై ప్రత్యేక అధికారులను కేటాయించామన్నారు. ప్రత్యేక పారిశుధ్య ిసిబ్బందిని, ఎక్స్‌కవేటర్‌లు, డోజర్లను ఏర్పాటు చేశారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

గోరుకల్లులో మంగళవారం రిజర్వాయర్‌ గేట్లు ఎత్తడంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నట్లు పాణ్యం తహసీల్దారు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు వరదతో గోరుకల్లు, కొండజూటూరు ర హదారిపై రాకపోకలు నిలిచిపో యాయని అన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. బుదవారానికి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. వరద ప్రవాహానికి 4.50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తహసీల్దారు తెలిపారు. కెనాల్‌ రక్షణ కట్ట మూడు చోట్ల దెబ్బతిందని వారం రోజుల్లో రక్షణ కట్టను పునర్మిస్తామని గోరుకల్లు ఈఈ భవానిప్రసాద్‌ తెలిపారు. ఈ సంఘటనపై సీఈ బుధవారం గ్రామాన్ని పరిశీలిస్తారన్నారు.

సమగ్ర విచారణ జరిపిస్తాం

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

గోరుకల్లు ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె గోరుకల్లును సందర్శించి జరిగిన సంఘటనపై అధికారులతో చర్చించారు. అనంతరం రిజర్వాయర్‌ గేట్లను పరిశీలించారు. గేట్లను ఎత్తడంపై ఇది దుండగుల పనా? లేక అధికారుల నిర్లక్షమా అన్న కోణంలో విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సంఘఽటనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఇప్పటికే ఎస్పీకి సూచించామన్నారు. గోరుకల్లు గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు చే పడతామన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 10:58 PM