Share News

శివరాత్రికి సిద్ధం కండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:48 PM

శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

శివరాత్రికి సిద్ధం కండి
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

శ్రీగిరిపై 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు

గత పొరపాట్లు పునరావృతం కాకూడదు

క్రితం కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం

సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

శ్రీశైలం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ పరిపాలనా భవన కమాండ్‌ కంట్రోల్‌ రూంలో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్పీ సునీల్‌ షెరాన్‌, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, డీఎఫ్‌వోలు విఘ్నేష్‌ అపోవు, నీరజ్‌, భవితకుమారి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు చిట్టిభొట్ల భరద్వాజ శర్మ, ఆల అనీల్‌ కుమార్‌, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్‌, రేఖగౌడ్‌, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో శివరాత్రి సందర్భంగా తొలి విడత సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రహ్మో త్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక రాష్ట్రం నుండి కాలినడకన వచ్చే పాదచారులకు పులులబారి నుండి సంపూర్ణ రక్షణ చర్యలు పకడ్బం దీగా చేయాలని అన్నారు. శ్రీశైల క్షేత్రానికి 100 కిలోమీటర్ల దూరం నుండి క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలలో చేపట్టవలసిన మౌలిక వసతుల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి అధికం గా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున గతంలో మంచినీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్‌, ట్రాఫిక్‌, క్యూలైన్ల నిర్వహణ లో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఉండే కొలనులు బావులతోపాటు క్షేత్ర పరిధిలోగల నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ అధికారులకు చెప్పారు. అంబులెన్సులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో సుమారు 1800లకు పైగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో ఏడు ప్రదేశాల్లో హైడ్రాలిక్‌ క్రేన్స్‌ అండ్‌ రికవరీ వ్యాన్స్‌, 27 ఎకరాలలో 5450 వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్ల ను చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ సునీల్‌ షరాన్‌ మాట్లాడు తూ 3,000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ అంతరాయాలు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్ర పరిధిలోకి నిషేధిత వస్తువులు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులు అధిక ధరలకు విక్రయిం చకుండా లీగల్‌ మెట్రాలజీ, సివిల్‌ సప్లై అధికారులు హెచ్చరికలు జారీ చెయ్యాలని అన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా మరమ్మతులు చేసి, జనరేటర్‌ వసతులను కల్పించాలని చెప్పారు. శివస్వాములకు ప్రత్యేకంగా క్యూలైన్ల ద్వారా మహా శివరాత్రికి ముందు 8వతేదీ నుండి 12వతేదీ రాత్రి ఏడు గంటల వరకు 5 రోజులు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:48 PM