జీడీడీపీ లక్ష్యం రూ.62,751 కోట్లు
ABN , Publish Date - May 07 , 2026 | 11:08 PM
జిల్లా ఆర్థికాభివృద్ధికి సూచికగా నిలిచే జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), జిల్లా తలసరి ఆదాయం (పీసీ) వృద్ధి రేటులో 2025-26లో జిల్లా బాగా వెనుకబడింది.
తలసరి ఆదాయం రూ.2,29,866
రాష్ట్రంలో 24వ స్థానంలో కర్నూలు జిల్లా
స్థూల ఉత్పత్తిలో 15వ స్థానం
2026-27లో 14.46 - 14.91 శాతం పెరుగుదల చూపాలని టార్గెట్
కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
హాజరైన మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డా. సిరి
కర్నూలు, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థికాభివృద్ధికి సూచికగా నిలిచే జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), జిల్లా తలసరి ఆదాయం (పీసీ) వృద్ధి రేటులో 2025-26లో జిల్లా బాగా వెనుకబడింది. తలసరి ఆదాయంలో ప్రమాదకర స్థాయిలో 24వ ర్యాంక్‌తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు సాధించాలని, జిల్లా స్థూల ఉత్పత్తి రూ.62,751కోట్లు సాధించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. వ్యవసాయం సహా అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన పెరుగుదల సాధించాలని దిశానిర్దేశం చేశారు. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, మైనింగ్.. వంటి కీలకమైన శాఖల ద్వారా వచ్చే ఆదాయం పెంచాలి. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలి. తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత పెంచడంలో జిల్లా అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలని మంత్రులు, కలెక్టర్లను ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా మంత్రి టీజీ భరత్‌గుప్తా, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి హాజరయ్యారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
మూడు రంగాలను బలోపేతం చేయాలి
వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.54,607 కోట్లు రాబట్టి 15వ స్థానంతోనే సరిపుచ్చుకున్నారు. గతేడాది అధిక వర్షాలు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ధరలు కూడా పతనం కావడంతో వ్యవసాయం రంగం రాబడి పూర్తిగా తగ్గిపోయింది. తాజా ఆర్థిక సంవత్సరంలో జీడీడీపీ 14.91 శాతం వృద్ధి రేటు సాధించి రూ.62,751 కోట్లు రాబట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది మే, జూన్, జూలై మాసాల్లో పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకావం ఉందని, తద్వారా వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తలసరి ఆదాయంలో జిల్లాకు రెడ్ మార్క్ తప్పలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.98 శాతం మాత్రమే పెరుగుదల సాధించి రూ.2,00,522లతో రాష్ట్రంలో 24వ స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రెడ్ మార్క్ ఇచ్చింది. తాజా ఆర్థిక సంవత్సరం 2026-27లో 14.46 శాతం వృద్ధి రేటు సాధించి జిల్లా తలసరి ఆదాయం రూ.2,29,866లు సాధించాలని లక్ష్యం విధించారు. లక్ష్యం సాకారం కావాలంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో రాబడి మెరుగైన పురోగతి సాధించాలి. వ్యవసాయ రంగంపై ఎల్‌నినో కత్తి వేలాడుతుండడంతో పారిశ్రామిక. సేవా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలి
జిల్లాలో పారిశ్రామిక పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంవోయూ, ఎస్‌ఐపీబీ అనుమతి పొందిన పరిశ్రమలు క్షేత్రస్థాపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. గతేడాది రూ.2,889 కోట్ల పెట్టుబడులతో ఆరు పరిశ్రమలు స్థాపించారు. వాటి ద్వారా 3,525 మందికి ఉపాధి, ఉద్యోగాలు రానున్నాయి. రూ.1,470 కోట్ల పెట్టుబడితో మరో ఐదు పరిశ్రమలు ఏర్పాటుకు దాదాపు సిద్ధం అవుతున్నాయి. వీటి ద్వారా 3,460 మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. జిల్లా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎస్‌ఐపీబీ అనుమతి పొందిన రూ.5,095 కోట్లతో రెండు పవర్ ఉత్పత్తి (ఎనర్జీ) ప్రాజెక్టులు ఇప్పటికే స్థాపించారు. రూ.3,726 కోట్లతో స్థాపించే మరో రెండు ప్రాజెక్టులు ఏర్పాటు దశలో ఉంటే, రూ.12,492 కోట్లతో చేపట్టే మరో ఐదు ప్రాజెక్టులు భూసేకరణ దశలో ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులు ద్వారా రూ.21,225 కోట్లు పెట్టుబడులు, 9,255 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని ప్రాజెక్టులు స్థాపించేలా చర్యలు తీసుకోవాలిన కలెక్టర్‌ను ఆదేశించారు.
సాధించాల్సిన పురోగతి:
జిల్లాలో 105 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి సాధించాంటే ఇంకా 12.47 హెక్టార్లు భూసేకరణ వేగవంతం చేయాలి. తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు.
వ్యవసాయ రంగాన్ని సౌరశక్తితో అనుసంధానించి, రైతులకు ఆర్థిక, ఇంధన భద్రత కల్పించాలనే లక్ష్యంగా పీఎం-కుసుం పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఈ నెల 5వ తేది నాటికి 47 మెగావాట్ల సామర్థ్యంలో 9 యూనిట్లు ఏర్పాటు చేశారు. సివిల్ వర్క్స్ ఏడు యూనిట్లకు 78 శాతం పూర్తి చేశారు.
పీఎం-సూర్యఘర్ పథకం కింద 30,707 దరఖాస్తులు రాగా, 5,826 దరఖాస్తులు ఎంపిక చేశారు. 286 యూనిట్లు పూర్తిగా ఏర్పాటుచేశారు.
జిల్లాలో 1,423 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా గతేడాది 2,55,092 మంది విద్యార్థులను బడిలో చేర్పించారు. 2026 - 27 విద్యా సంవత్సరంలో 2,81,260 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యం నిర్దేశించారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులు మార్చిలో 69.10 శాతం, ఏప్రిల్‌లో 69.50 శాతం విద్యార్థులు భోజనాలు చేశారు. దీనిని 75-85 శాతానికి పెంచాలని సూచించారు.
ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటెర్‌ప్రైజెస్ స్కీం (పీఎంఎప్‌ఎంఈ) కింద గత మార్చి లెక్కలు ప్రకారం 2020-21 నుంచి 2025-26 వరకు ఐదేళ్లలో జిల్లాలో 467 ధరఖాస్తులు వచ్చాయి. 392 మంది యూనిట్లు స్థాపించారు. 2026-27లో వంద యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించారు.