Share News

గరుడ అవార్డులు కర్నూలుకే గర్వకారణం

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:14 PM

రాష్ట్రస్థాయిలో పేరొందిన గరుడ అవార్డుల్లో కర్నూలు కళాకారుల సత్తా జిల్లాకే గర్వకారణమని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

గరుడ అవార్డులు కర్నూలుకే గర్వకారణం
అతిథులతో సత్కార గ్రహీతలు

కర్నూలు కల్చరల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో పేరొందిన గరుడ అవార్డుల్లో కర్నూలు కళాకారుల సత్తా జిల్లాకే గర్వకారణమని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. టీటీడీ, ఎస్వీ నాట్య కళా పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతిలో జరిగిన గరుడ పద్య నాటక పోటీల్లో టీజీవీ కళాక్షేత్రానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణ కమలపాలిక నాటకం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కళాకారులకు గరుడ అవార్డుల ప్రదాన సత్కారాలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, ఓర్వకల్లు తహసీల్దార్‌ విద్యాసాగర్‌ హాజరయ్యారు. కమిషనర్‌ మాట్లాడుతూ కర్నూలు కళాకారులు ఎక్కడ నాటకాలు ప్రదర్శించినా బహుమతులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందకు సాగాలని, రాయలసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. రాయలసీమకు ప్రధాన ద్వారంగా ఉన్న కర్నూలు నుంచి గొప్ప గొప్ప కళాకారులు, మేధావులు ప్రపంచానికి పరిచయం అయ్యారన్నారు. కళాకారుల కోసం మంత్రి టీజీ భరత్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టీజీవీ కళాక్షేత్రం కళాకారులు ఇలాంటి మైళ్లురాళ్లను అధికమించాలని ఆకాంక్షించారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కళల కోసం టీజీ కుటుంబ చేస్తున్న సేవలు అనన్యమైనవని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళలు, కళాకారుల సంక్షేమానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కళాకారులను చల్లా ఓబులేసుతో పాటు తహసీల్దార్‌ విద్యాసాగర్‌, టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌ గౌడు గరుడ అవార్డులతో ఘనంగా సత్కరించారు.

Updated Date - Sep 13 , 2026 | 11:14 PM