Share News

ప్రజాధనం వృథా

ABN , Publish Date - May 18 , 2026 | 12:29 AM

: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు నేడు ముళ్లపొదల్లో మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి

ప్రజాధనం వృథా
చెరువు కరకట్టపై నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం

ఊరు చివర సచివాలయాల నిర్మాణం

వెక్కిరిస్తున్న మొండిగోడలు

మహిళా ఉద్యోగుల భద్రతపై ఆందోళన

కోసిగి, మే 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు నేడు ముళ్లపొదల్లో మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి. నాటి పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఈ భవనాలవైపు కన్నెత్తి చూడలేదు.

అనువు కానిచోట నిర్మాణాలు..

ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు అందుబాటులో, అనువైన చోట నిర్మించాల్సి ఉండగా... గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలకు కిలో మీటర్ల దూరంలో, ఊరు చివరన సచివాలయాలను నిర్మించింది. కోసిగి మండలంలోని 3వ వార్డులో ఉన్న బోగేని చెరువు ఆనకట్టపై ఒకవైపు రోడ్డు, మరోవైపు చెరువు ఉండేలా సచివాలయాన్ని, ఆర్‌బీకేను నిర్మించడం నాటి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఊరికి దూరంగా, నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్మించిన ఈ కార్యాలయాల్లోకి వెళ్లి విధులు నిర్వహించడానికి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సజ్జలగుడ్డం వంటి గ్రామాల్లో ఊరి చివర కట్టడం వల్లే పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

కాంట్రాక్టర్లకు రాని బిల్లులు

అప్పట్లో స్థానిక నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ భవనాలను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. కోసిగి-1 సచివాలయం జగనన్న కాలనీలో పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉండడంతో ఇది ముళ్లచెట్ల మధ్య మూలుగుతోంది. మండలంలో ఆరు ఆర్‌బీకేలు, ఏడు హెల్త్‌ సెంటర్‌లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. పూర్తయిన భవనాలకు సైతం కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

మొండిగోడలకే పరిమితమైన గ్రామాలు ఇవే..

మండలంలోని చింతకుంట, పల్లెపాడు, కోసిగి-2, కోసిగి-3, కోసిగి-5, డి.బెలగల్‌, సజ్జలగుడ్డం, కందుకూరు, సాతనూరు, అగసనూరు, ఆర్లబండ గ్రామాల్లో నేటికీ గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్‌లు పూర్తికాక మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. నాడు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోసిగి గ్రామ సచివాలయం-4, జంపాపురం, దుద్ది, వందగల్లు, పెద్దబోంపల్లి సచివాలయాలను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ మిగిలిన వాటిని మాత్రం గాలికి వదిలేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి కోట్ల రూపాయల ప్రజాధనం వృథాగాకుండా ఈ భవనాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వం నివేదికలు కోరింది

మండలంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్‌ల వివరాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఇప్పటికే కలెక్టర్‌కు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేశాం. పూర్తయిన కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే ప్రారంభోత్సవ తేదీలు ఖరారు కానున్నాయి. - డి.సి. వెంకటేష్‌, ఆదోని పీఆర్‌ఈఈ

Updated Date - May 18 , 2026 | 12:29 AM