నిధుల డ్రాకు ఎత్తులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:45 PM
ఏప్రిల్ 2వ తేదీన పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియనుంది.
ఏప్రిల్ 2న ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం
రూ.31కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు
ఖాళీ అవుతున్న పంచాయతీ ఖాతాలు
ప్రత్యేకాధికారుల చేతుల్లో ‘పల్లె పాలన’
ఏప్రిల్ 2వ తేదీన పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఏటా రెండు విడతలు (రెండు క్వార్టర్లు) చొప్పున ఐదేళ్ల పదవీ కాలంలో పంచాయతీలకు పది విడతలుగా ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఖాతాలకు జమ చేస్తుంది. ఇటీవలే ఆఖరి విడత (ఫైనల్ క్వార్టర్) 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31 కోట్లు గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులను కేవలం తాగునీటి సమస్య పరిష్కారానికి వాడాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయినా సర్పంచులు ఎలాగైనా వీటిని డ్రా చేసుకొని పంచాయతీ ఖాతాలను ఖాళీ చేయాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఆరునెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం ప్రకటించారు. ఈ ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
కర్నూలు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మరో 15 రోజుల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగి యనుంది. 15వ ఆర్థిక సంఘం ఆఖరి విడత (ఫైనల్ క్వార్టర్) నిధులు రూ.31 కోట్లు వివిధ గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. చెక్ పవర్ ఉన్నప్పుడే వీలైనంత వరకు నిధులు డ్రా చేసుకోని ఖాతాలు ఖాళీ చేసేందుకు పలువురు సర్పంచ్‌లు ఎత్తులు వేస్తున్నట్లు తెలు స్తుంది. పనులు చేశాం.. బకాయి బిల్లులు డ్రా చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ అధి కారులపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు ఇవ్వకుండా వాడుకోవడంతో సర్పంచులు రోడ్డెక్కి బిక్షాటన చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏటా రెండు విడతలు ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకే ఇస్తూ వచ్చింది. సర్పంచులు ఆర్థిక కష్టాల నుంచి కొంతవరకు కోలుకున్నారు.
ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుంది. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. అంటే.. ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాయలం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో 484 పంచాయతీలున్నాయి. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని కలు జరిగే అకాశం ఉందని, ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి అంటూ మంత్రివర్గ సహ చరులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అధికారుల కసరత్తు
మరో ఆరు నెలలు ప్రత్యేక అధికారుల చేతు ల్లో ‘పల్లె పాలన’ సాగనుంది. ఈ నెల ఆఖరు లోగా జిల్లాలో 19 మేజర్ పంచాయతీలు సహా 484 పంచాతీయలకు కలెక్టర్ ప్రత్యే అధికా రులను నియ మించేందుకు కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఏఈఈ, ఈవోఈర్డీ, మండల వ్యవసాయ అధికారులు.. వంటి మండల స్థాయి గెజిటెడ్ అధికారులను పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి పంచాయతీ పాలక వర్గం నియామకం జరిగే వరకు వారు ఆ పదవుల్లో ఉంటారు.
నేరుగా పంచాయతీ ఖాతాలకు జమ
ప్రతి ఏటా రెండు విడతలు (రెండు క్వార్టర్లు) చొప్పున ఐదేళ్ల పదవీ కాలంలో పంచాయతీలకు పది విడతలుగా ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఖాతాలకు జమ చేస్తుంది. ఈనిధులు పంచాయతీల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, సిబ్బంది జీతాలకు మాత్రమే వినియోగించాలి. నిధుల డ్రా చేసుకోవడానికి సర్పంచ్‌కి చెక్ పవర్ ఉంటుంది. ఇటీవలే ఆఖరి విడత (ఫైనల్ క్వార్టర్) 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31 కోట్లు గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేశారు.
ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో గ్రామాల్లో తలెత్తనున్న తాగునీటి ఎద్దడి వంటి సమస్యల దృష్ట్యా ఆర్థిక సంఘం నిధులు డ్రా చేయకూడదని నిబంధనలతో ప్రభుత్వం పంచాయతీలకు ఉత్తర్వు లు జారీచేసింది. అతిక్రమించి నిధులు డ్రా చేస్తే చర్యలు తప్పవు అంటూ స్పష్టంగా పేర్కొ న్నారు. మరో 15రోజుల్లో పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగుస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలు జరగాయి. 85 శాతం సర్పంచులు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. పదవీ కొల్పోయిన సర్పంచులకు ప్రాధ్యానత ఉండదు. దీంతో పదవి ఉండగానే నిధులు సర్దుకోవాలి..! అన్నట్లుగా ఇష్టారాజ్యంగా డ్రా చేసి పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసి వెళ్లేందుకు ఎత్తులు వేస్తూ.. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పలు మండలాల్లో కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తుంది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జిల్లాలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31 కోట్లు విడుదలైన మాట నిజమే. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, సిబ్బంది జీతాలు ఒక్కటే ఈ నిధులు ఖర్చు చేయాలి. నిబంధనలు అతిక్రమించి నిధులు డ్రా చేస్తే వారిపై చర్యలు తప్పవు.
జి. భాస్కర్, డీపీవో, కర్నూలు