ఆది దంపతులకు పౌర్ణమి పూజలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:34 PM
శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ, మహామంగళ హారతుల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.
శ్రీశైలం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ, మహామంగళ హారతుల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. గ్రామదేవత అంకాలమ్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్చనలు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ప్రధాన ద్వారం గుండా పల్లకిలో తీసుకువచ్చి గంగాధర మండపం వద్ద ప్రచార రథంపై ఆశీనులచేసి శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ జరిపించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం, అలంకారేశ్వరస్వామి ఆలయం, వలయ రహదారి నుంచి పంచమఠాలు, పురాతన అనుబంధ ఆలయాల మీదుగా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. దర్మప్రచార రథంలో జరిగిన గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి అలయ ప్రాకారంలో ఏర్పాటుచేసిన ఊయలను పుష్పాలతో అలంకరించి స్వామి, అమ్మవార్లకు లలితా సహస్రనామాలతో పారాయణం, త్రిశతి, ఖడ్గమాల, అర్చనలు చేశారు. ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవను జరిపించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఉభయ దేవాలయాల్లో దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.