Share News

ఎఫ్‌ఆర్‌ఎస్‌.. నిరర్థకం

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:36 PM

కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రి, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, రీజనల్‌ ఐ హాస్పిటల్‌లో వైద్యులు, సిబ్బంది హాజరుకు సంబంధించి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఎఫ్‌ఆర్‌ఎస్‌.. నిరర్థకం

కర్నూలు బోధనాసుపత్రి వైద్యుల విధి నిర్వహణపై ఆరోపణలు

సమస్యను పరిష్కరించని ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌

ఎఫ్‌ఆర్‌ఎస్‌పై కాలేజీ, ఆసుపత్రుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రి, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, రీజనల్‌ ఐ హాస్పిటల్‌లో వైద్యులు, సిబ్బంది హాజరుకు సంబంధించి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చాలా కాలంలో సక్రమంగా లేని విధి నిర్వహణను దారిలో పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారు. ఆచరణలో అదీ నిరర్థకమే అని తేలిపోయింది. అంత బాధ్యతారహితంగా వైద్యులు వ్యవహరిస్తున్నారు. కొందరు వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అధికారులు అసలు ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిజిస్టర్‌ చేసుకోలేదని కూడా తెలుస్తోంది. కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వైద్యులు 436 మంది ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్లు 65 మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 64 మంది, అసిస్టెట్‌ ప్రొఫెసర్లు 221, ట్యూటర్లు 54, మెడికల్‌ ఆఫీసర్లు, ఎస్‌ఆర్‌లు ఉన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు, అధికారులు ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటలకు ఒకసారి సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు రోజు రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా రోజూ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది వైద్యులు, సిబ్బంది ఉదయం హాజరు వేస్తే సాయంత్రం వేయకపోవడం, లేదా ఆలస్యంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయడం, పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో కొందరు వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరించడం వంటి సమస్యలు ఉన్నాయి. గతంలో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఉన్నప్పటి కంటే దారుణమైన పరిస్థితి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రి, ఐ-హాస్పిటల్‌లో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం అమలు కావడం లేదు.

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వాసు పత్రిలో ఓ ప్రొఫెసర్‌ జూన్‌ 16 నుంచి సెలవులో వెళ్లారు. జూలై 26వ తేదీ ఆస్పరి లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ-సంజీ విని ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా కర్నూలు జీజీ హెచ్‌ అధికారులు సేఫ్‌ రూం విధులకు ఆ ప్రొఫెసర్‌ వెళ్లాల్సి ఉంది. అయితే ఆ ప్రొఫెసర్‌ సెలవులో ఉన్నారని చెప్పడంతో సీఎం పర్యటన తర్వాత జూలై 27న కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రిన్సిపాల్‌కు ఓ లేఖ రాశారు. ఆ ఫ్రొఫెసర్‌ ఎన్ని రోజులు అధికారికంగా సెలవులో ఉన్నారో చెప్పాలని అడిగారు. ఆ ప్రొఫెసర్‌ అనధికారికంగా సెలవులో ఉన్నట్లు తెలియడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవహారం బయటపడింది. అధికారులు ప్రశ్నించడంతో ఆ ప్రొఫెసర్‌ ఆగస్టు మొదటి వారం విధుల్లో చేరారు. ఎన్‌ఎంసీ విజిట్‌కు వెళ్లినట్లు ఆ ప్రొఫెసర్‌ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మరి కొందరు వైద్యుల వ్యవహారం కూడా తీగ లాగితే డొంక కదిలినిట్లు వెలుగులోకి వచ్చింది.

ఇదీ పరిస్థితి

కొందరు వైద్యులు అనంతపురం నుంచి రోజూ కర్నూలుకు విధులకు వచ్చి వెళుతున్నారు. నిర్ణీత సమయానికి ముందుగానే కొందరు వైద్యులు భోజనం చేసి అనంతపురం వెళ్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో అధికారులు కొందరికి అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కర్నూలు మెడికల్‌ కాలేజీలోని ఓ నాన్‌ క్లినికల్‌ విభాగంలో పని చేసే ఓ ప్రొఫెసర్‌ మధ్యాహ్నం తర్వాత విధులకు గత కొన్ని రోజులుగా హాజరు కావడం లేదు.

కర్నూలు మెడికల్‌ కాలేజీలోని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నెలల తరబడి సెలవులో ఉన్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

కర్నూలు జీజీహెచ్‌లో అత్యంత రోగుల రద్దీ ఉండే ఆ విభాగానికి ఫ్రొఫెసర్‌గా ఉండే ఓ డాక్టర్‌ పని వేళలు పాటించడం లేదని, మధ్యాహ్నం తర్వాత విధులకు హాజరు కావడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

ఇక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహించే ఓ ఫ్రొఫెసర్‌ తరచూ సెలవు వెళ్తున్నా వేతనం మాత్రం పూర్తి స్థాయిలో ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హాస్పిటల్‌ అధికారులకు ఆ ప్రొఫెసర్‌ తరచూ సెలవులో వెళ్లడం వల్ల రోగులు, పీజీ వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.

కొందరు వైద్యులు తెల్లవారుజామున వాకింగ్‌కు రాయడం, అది ముగిసిన వెంటనే ఉదయం ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయడం అటు నుంచి అటే ఇంటికి వెళ్లి తిరిగి ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీకి రావడం తంతుగా మారింది.

మరి కొందరు వైద్యులు సాయం త్రం 4 గంటలకు వెళ్లాల్సి ఉండగా ఎఫ్‌ఆర్‌ఎ్‌సను వేయకుండా ఇళ్లకు వెళ్లిపోయి, రాత్రి క్లినిక్‌లు ముగిసిన తర్వాత రాత్రి 8.30 గంటలకు కాలేజీకి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

కొందరు వైద్యులు ఉదయం ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తే సాయంత్రం ఎఫ్‌ఆర్‌

ఎ్‌సకు హాజరు వేయడం లేదు. సాయంత్రం వేస్తే ఉదయం హాజరు కావడం లేదు.

ఆసుపత్రిలో పని చేస్తూ అందరిపై పెత్తనం చెలాయించే ఓ అధికారికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ అనే నిబంధన వర్తించదట. ఆ అధికారి ఎఫ్‌ఆర్‌ఎస్‌ జాబితాలో లేకపోవడం, రిజిస్టర్‌ కాకపోవడంతో ఎప్పుడు ఆసుపత్రికి వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో అడిగే నాథుడే కరువయ్యారు. అసలు ఆ అధికారి ఎందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వర్తించదు? అనేది కీలక ప్రశ్న. సామాన్య ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ పేరుతో వేధించే ఉన్నతాధికారులు తాము మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆ అధికారికి పీఏగా ఉన్న ఓ చిరుద్యోగి కూడా తానేమీ తక్కువ తినలేదని ప్రతి రోజూ ఇష్టమైన సమయానికి డ్యూటీకి రావడం, ఆ తర్వాత ఇష్టమైన సమయానికి వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ చిరుద్యోగి గత నెలకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎ్‌సను పరిశీలించగా ఉదయం కొంత ఆలస్యంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసినట్లు, సాయంత్రం కేవలం నాలుగుసార్లు మాత్రమే ఎఫ్‌ఆర్‌ఎ్‌సవ వేసినట్లు తెలిసింది. అధికారి వచ్చిన తర్వాతనే విధులకు హాజరవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే మరికొందరు యూనియన్‌ నాయకులమనే పేరుతో మధ్యాహ్నం తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నారు. అధికారులకు అనుకూలంగా ఉన్న మరి కొందరు ఉద్యోగులు అసలు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నారో లేదా తెలియడం లేదు.

ఎఫ్‌ఆర్‌ఎ్‌సపై పర్యవేక్షణ ఏదీ...?

అధికారులు పనిభారం పేరుతో, ఇతర కారణాలతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ సమీక్ష అపహాస్యం చేస్తున్నారు. 2026 మే నెలకు సంబంధించి ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ సమీక్షించి 22 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఎఫ్‌ఆర్‌ఎ్‌సను సమీక్షించిన పాపాన పోలేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ పర్యవేక్షణ బాధ్యత స్పష్టంగా ఓ వైస్‌ ప్రిన్సిపాల్‌కు అప్పగించాల్సి ఉంది. సంబంధించిన ఉద్యోగులు కూడా లోపాలు ఉంటే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే కాలేజీలో ఉన్న వైస్‌ ప్రిన్సిపాల్‌ కొందరు ఆఫీసుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ రెండుసార్లు వేయాల్సిందే

ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎ్‌సను వైద్యులు వేయాల్సిందే. మే నెలకు సంబంధించి ఎఫ్‌ఆర్‌ఎ్‌సను సమీక్షించి అందులో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు శాతం తక్కువగా ఉన్న వైద్యులు, ఒక పూట ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసిన వైద్యులను 22 మందిని గుర్తించి వారికి నోటీసులు, వివరణ కోరాం. ఆ తర్వాత జూన్‌, జూలై నెలలకు సంబంఽధించిన ఎఫ్‌ఆర్‌ఎ్‌సను పని ఒత్తిడి వల్ల సమీక్షించలేకపోయాను. వైద్యులు నిబంధనల ప్రకారమే సెలవులు పెడుతున్నారు. కొందరు వైద్యులు చెప్పకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

- డా.కే. చిట్టినరసమ్మ, ప్రిన్సిపాల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ

Updated Date - Aug 10 , 2026 | 11:36 PM