Share News

వర్సిటీల్లో ముఖచిత్ర హాజరు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:14 AM

కూటమి ప్రభుత్వం కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్‌ ఏర్పాటు చేసి విద్యా పాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

వర్సిటీల్లో ముఖచిత్ర హాజరు

ఉన్నత విద్యను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు

కర్నూలు అర్బన్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్‌ ఏర్పాటు చేసి విద్యా పాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని రాయలసీమ, క్లస్టర్‌, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీలకు అనుబంధంగా ఉన్న ఒక లా కాలేజీ, 97 డిగ్రీ కళాశాలలు, బీఈడీ 60, ఇంజనీరింగ్‌ 12, నర్సింగ్‌ కాలేజీలు 29, ఐటీఐ 12, పీజీ 10 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఉన్న విద్యా కమిషనరేట్‌ అడుగులు వేస్తూ ఉన్నత విద్యను చదివే ప్రతి విద్యార్థి కళాశాలలకు వెళ్లి చదివే దిశగా చర్యలు చేపడుతోంది. జూన్‌ 29 నుంచి ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, ఈనెల 6 నుంచి డిగ్రీ కళాశాలలు, 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 27 నుంచి బీఈడీ, బీపీఈడీ, లా, పీజీ కళాశాలల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

బీఈడీ కళాశాలల్లో అక్రమాలకు చెక్‌ పడేనా?

రాష్ట్రంలోని వర్సిటీలకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్‌ బీఈడీ కళాశాలల్లో చాలా సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలకు ముఖ హాజరు చెక్‌ పడేనా? అన్న చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం కొన్ని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు హాజరును మేనేజ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు విద్యార్థులు కళాశాలకు రాకుండానే బీఈడీ పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే చాలా కళాశాలల్లో నాణ్యమైన బీఈడీ విద్య లేకపోవడంతో రెగ్యులర్‌గా కళాశాలకు వచ్చి చదువుకోవాలన్న విద్యార్థులకు నిరాశ కలిగిస్తోంది. బీఈడీ విద్యను భ్రష్టు పట్టించారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

Updated Date - Jul 01 , 2026 | 12:14 AM