దోపిడీకి పాల్పడిన నలుగురి అరెస్టు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:00 AM
పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకున్న యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, ఇనపు రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత తెలిపారు. గురువారం నంద్యాల ఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
కత్తులు, ఫోన్లు, నగదు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత
నంద్యాల క్రైమ్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకున్న యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, ఇనపు రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత తెలిపారు. గురువారం నంద్యాల ఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 158/2026, యు/ఎస్ 309(6) బిఎన్‌ఎ్‌స కేసులో ఈ అరెస్టులు జరిగినట్లు ఏఎస్పీ తెలిపారు. ఆగస్టు 15న పోలో యాప్ ద్వారా ఫిర్యాదీకి నిందితుల్లో ఒకరితో పరిచయం ఏర్పడిందన్నారు. అనంతరం నంద్యాల-కొత్తపల్లి రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద కార్యక్రమం ఉందని, అక్కడ స్నేహితులు ఉన్నారని చెప్పి ఫిర్యాదీని తమ వెంట తీసుకెళ్లి కత్తులతో బెదిరించి, ఇనుప రాడ్లతో దాడిచేసి, అతని వద్ద ఉన్న రూ.7,200 నగదు, మొబైల్ ఫోన్ లాక్కొని పరారైనట్లు ఏఎస్పీ వివరించారు. ఈ ఘటనపై ఆగస్టు 17న ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. తాలుకా సీఐ ఆర్ ఈశ్వరయ్య, ఎస్‌ఐలు గంగయ్య యాదవ్, జప్రూల్లా ఖాన్, సురేష్ కుమార్ తదితరులు నందమూరి నగర్ సమీపంలోని పీవీఏ వెంచర్స్ వద్ద బొల్ల్లెద్దుల పవన్‌కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులేటి వెంకట ఉమాకాంత్, బాలశెట్టి హేమంత్‌లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, రెండు ఇనుపరాడ్లు, ఫిర్యాది మొబైల్ ఫోన్, నిందితుల నాలుగు మొబైల్ ఫోన్లు, రూ 5800 నగదు, హోండా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎ్‌సపి తెలిపారు.