Share News

అటవీశాఖ అలర్ట్‌..!

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:18 PM

శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు కాలినడకన వెళ్లే కన్నడ భక్తులకు ఏర్పాట్లు చేసే విష యంలో అటవీ అధికారులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు.

అటవీశాఖ అలర్ట్‌..!
ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయం

సేవలు అందించినా విమర్శలు తప్పలేదని ఉగాది ఉత్సవాల్లో అప్రమత్తం

మహాశివరాత్రికి రూ.68 లక్షలతో ప్రతిపాదనలు

శ్రీశైల దేవస్థానం ఇచ్చింది రూ. 5లక్షలే..!

ఉగాది సందర్భంగా కచ్చితంగా వ్యవహరించనున్న అటవీ అధికారులు

ఆత్మకూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు కాలినడకన వెళ్లే కన్నడ భక్తులకు ఏర్పాట్లు చేసే విష యంలో అటవీ అధికారులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో శ్రీశైలంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తప్పంతా అటవీ శాఖదే అన్నట్లు వచ్చిన ఆరోపణల మీద నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారం ఆ శాఖలో మనోవేదన మిగిల్చింది. దీంతో ఉగాది ఉత్సవాల విషయంలో అప్రమత్తంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలకు నల్లమల అటవీ మార్గంలో లక్ష్యల సంఖ్యలో పాదయాత్రికులు తరలివెళ్తారు. వీరి వల్ల అడవికి, వన్యప్రాణులకు నష్టం వాటిల్లకుండా అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. భక్తులకు సదుపాయాలను కూడా కల్పి స్తోంది. శివరాత్రి ఉత్సవాల సమయంలో దేశవ్యాప్తంగా పులుల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నందు వల్ల శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులకు అటవీశాఖ పలు ఆంక్షలను విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 19వ తేది వరకు మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో తొలుత 8 నుంచి 15వ తేది వరకు మాత్రమే నడిచి వెళ్లేందుకు అనుమతించింది. ఆ తర్వాత భక్తుల విజ్ఞప్తి మేరకు 6వ తేది నుంచే నడిచి వెళ్లేందుకు నిబంధనలను సడలించింది. ఈ నిబంధనలే అటవీశాఖ మీద విమర్శలకు కారణం అయ్యాయి.

శ్రీశైలంలో ఉద్రిక్తత.. అటవీశాఖపై నిందలు..

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 9న శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీనికి అటవీశాఖే కారణమనే నిందలు వినిపించాయి. చివరికి ప్రభుత్వ దర్యాప్తు బృందాలు కూడా ఇదే నిజమని ధృవీకరించాయి. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజున నడిచి వెళ్లి 9వ తేదీ సోమవారం స్వామివారిని దర్శించుకొనేలా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. దీంతో బ్రహ్మోత్సవాల ఆరంభ దినాల్లో ఎన్నడూ లేనంత మంది భక్తులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అటవీశాఖ ఆంక్షలే కారణమని దేవదాయ, పోలీసుశాఖలు ఆరోపించాయి. పర్యవసానంగా ఎన్‌ఎస్‌టీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ను బదిలీ చేశారు.

చివరికి విమర్శలే ..!

శ్రీశైలంలో జరిగే ఉత్సవాలకు వెళ్లే పాదయాత్రికులకు, అటవీ, వన్యప్రాణుల రక్షణకు రూ.68లక్షల వరకు శ్రీశైల దేవస్థానాన్ని అటవీశాఖ నిధులు కోరింది. వారు కేవలం రూ.5లక్షలు మాత్రమే ఇచ్చారు. పాదయాత్రికుల సౌకర్యాలు, జంగిల్‌ క్లియరెన్స్‌, ఫైౖర్‌లైన్స్‌, ప్లాస్టిక్‌ ఏరివేతకు కూలి, అటవీ ఉద్యోగుల వసతి మొదలైనవి అటవీశాఖే కల్పిస్తోంది. ఈలెక్కన రూ.35లక్షల వరకు ఖర్చు చేసింది. ఉగాది ఉత్సవాలకు కూడా మరో రూ.30లక్షల వరకు ఖర్చులు భరా యించాల్సి ఉంటుంది. ఇంతా చేసి చివరికి విమర్శలు ఎందుకు భరించాని ఈసారి కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఉగాది ఉత్సవాలపై ముందస్తు ప్రణాళిక

ఉగాది ఉత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 28న కలెక్టర్‌ రాజకుమారి సమక్షంలో జరిగిన ఉగాది ఉత్సవాల ఏర్పాట్ల సమీక్షలో భాగంగా మార్చి 2 నుంచి నడిచి పాదయాత్రికులకు ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌అప్పావ్‌ అనుమతులు ఇచ్చారు. అలాగే పలు కీలక విషయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. శ్రీశైల దేవస్థానాన్ని శివరాత్రి సందర్భంగా రూ.68లక్షలు అడిగితే కేవలం రూ.5లక్షలు ఇచ్చారని ఈ నిధులు తమకు ఏమాత్రం చాలడం లేదని స్పష్టం చేశారు.మహాశివరాత్రి ఉత్స వాలకే రూ.35లక్షల మేర ఖర్చయ్యాయని, తమకు నిధుల కొరత ఉందని అటవీశాఖ వివరించినట్లు సమాచారం. ఇందు కు స్పందించిన దేవస్థానం అధికారులు బిల్లులను నివేదిస్తే.. రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఉగాది ఉత్సవాల విషయంలో కూడా దేవస్థానం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పాదయాత్రికుల రద్దీ విషయంలో కూడా దేవస్థానం సమన్వయం చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు గుర్తుచేసినట్లు తెలిసింది.

ఎన్‌ఎస్‌టీఆర్‌ బదిలీ వ్యవహారంలో పునఃసమీక్ష

నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ బదిలీ వ్యవహారంపై అటవీశాఖ వర్గాల్లో పునఃసమీక్ష జరుగుతున్నట్లు తెలిసింది. టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో వెళ్లే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు ఆయన అభ్యంతరం చెప్పడం, అటవీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను వ్యతిరేకించడం వల్లే ఆయన్ని టార్గెట్‌ చేసి శ్రీశైలం ఘటనను సాకు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు కూడా తొలుత ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఇటీవల ఈ వాస్తవాలు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ను మళ్లీ ఎన్‌ఎస్‌టీఆర్‌కి బదిలీ చేయవచ్చునని సమాచారం.

Updated Date - Mar 10 , 2026 | 11:18 PM