ఆరడుగుల నేల కోసం
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:56 PM
మరణించాక కూడా కష్టాలు తీరకపోవడం అంటే ఇదే. బతికి ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించినా చనిపోయాక కావలసింది ఆరడుగుల నేల మాత్రమే.
ఖననం చేయాలంటే సమాధులను తవ్వాల్సిందే
గజ్జెహళ్లిలో శ్మశానం లేక అగచాట్లు
హొళగుంద, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మరణించాక కూడా కష్టాలు తీరకపోవడం అంటే ఇదే. బతికి ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించినా చనిపోయాక కావలసింది ఆరడుగుల నేల మాత్రమే. ఆ ఇంత నేల దొరకకపోవడం దుర్భరం. గజ్జెహళ్లి గ్రామంలో శ్మశానం లేక నానా అగచాట్లు పడుతున్నారు. హొళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామస్థులు తమకు చావులో కూడా ప్రశాంతత కరువైందని వాపోతున్నారు. శ్మశాన వాటికలో స్థలం కొరత ఆ గ్రామాన్ని పట్టి పీడుస్తోంది. మంగళవారం కురువ ఆదోని చిన్న సిద్ధప్ప(70) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనను ఖననం చేసేందుకు శ్మశానంలో స్థలం లేక గతంలో చనిపోయిన వ్యక్తి సమాధి తవ్వి అతని అస్తికలు, పుర్రె, బట్టలు బయట పడేసి సిద్ధప్ప శవాన్ని ఖననం చేయాల్సి వచ్చింది. ఇట్లా చేయడం కలచివేస్తోందని, అయితే శ్మశానంలో స్థలం లేక చేయకతప్పడం లేదని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి శ్మశాన వాటికకు స్థలం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మీరాజును వివరణ కోరగా, గజ్జెహళ్లి నుంచి గ్రామస్థులు శ్మశాన వాటికకు స్థలం కోసం అర్జీ పెట్టుకుంటే.. ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.