ఉత్తమ ఫలితాల సాధనకు..
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:08 AM
ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు పదోతరగతి పాఠాల బోధన ప్రారంభమైంది. వీరికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు ముగియడంతో ఈనెల 13 నుంచి పదోతరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి బ్రిడ్జికోర్స్ ప్రారంభం
చాగలమర్రి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు పదోతరగతి పాఠాల బోధన ప్రారంభమైంది. వీరికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు ముగియడంతో ఈనెల 13 నుంచి పదోతరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభించారు. ఏప్రిల్ 23 వరకు పదో తరగతి సబ్జెక్టుల్లో 4 అధ్యాయాల వంతున ఉపాధ్యాయులు బోధించనున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద ప్రాక్టిస్ చేయాల్సి ఉంటుంది. తిరిగి వేసవి సెలవుల అనంతరం మిగిలిన పాఠ్యాంశాలను బోధిస్తారు. దీంతో సిలబస్ త్వరగా పూర్తవడంతో పాటు రివిజన్‌కు అవకాశం ఉంటుందని, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెరిగి ఉత్తమ ఫలితాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. చివరి వారంలో పరీక్షలు నిర్వహించి, మూల్యాంకణ చేసి మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధన
బ్రిడ్జికోర్స్ బోదనతో విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా విద్య అందుతుంది. హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. 9వ తరగతి విద్యార్థులు పదోతరగతిలో పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. - శివలక్ష్మి, హెచ్‌ఎం, చాగలమర్రి
విద్యార్థుల కోసమే బ్రిడ్జికోర్స్..
విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం బ్రిడ్జికోర్స్ ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది. 40 రోజుల పాటు బోధన ఉంటుంది. -న్యామతుల్ల, ఎంఈవో, చాగలమర్రి