Share News

ఇక కర్నూల్లోనే ఆహార పరీక్షలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:55 PM

ఆహార భద్రత, ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో, స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక కర్నూల్లోనే ఆహార పరీక్షలు

మెడికల్‌ కళాశాలలో ల్యాబొరేటరీ

నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

రూ.19.84 కోట్లు మంజూరు

ఆహార భద్రత, ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో, స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం కింద నోటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంగా భారత ఆహార భద్రత ప్రమాణాలు, ప్రాధికార సంస్థ ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. కర్నూలు మెడికల్‌ కళాశాలలో ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర ఆహార ప్రయోగశాలను నోటిఫై చేయాలని కోరుతూ ఏపీ ఆహారభద్రత కమిషనర్‌ విన్నపం మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కర్నూలు ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఆహార భద్రత కమిషన్‌ ఏఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తో 2024-25లో రూ.88.41 కోట్లకు అవగా హన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే కర్నూలులో ఏర్పాటు చేసే రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు రూ.19.84 కోట్లు కేటాయించారు. అందులో రూ.6.50 కోట్లు ప్రాథమిక పరికరాలు, వివిద సౌకర్యాల కల్పనకు, రూ.8.46 కోట్లు హై-ఎండ్‌ పరికరాలు, రూ.4.28 కోట్లు మైక్రో బయాలజికల్‌ లాబొరేటరీ ఏర్పాటుకు 250 కేవీ జనరేటర్‌కు రూ.30 లక్షలు, విద్యుత్‌ కనెక్షన్‌కు రూ.30 లక్షలు కేటాయించారు.

ఆహార నాణ్యతకు పెద్దపీట

ఆహారభద్రత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించే తనిఖీల్లో సేకరించే ఆహార నమూనాలను పరీక్షించడానికి హైదరాబాదులోని స్టేట్‌ ఫుడ్‌ లేబోరేటరీకి పంపిస్తున్నారు. ఫలితాల కోసం నాలుగు నుంచి ఐదు వారాల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ లాబొరేటరీ కర్నూలులో ఏర్పాటు చేస్తే ఆహార నమూనాలను ఇక్కడ పరీక్షిస్తారు. తక్కువ సమయంలో రిపోర్టు వస్తుంది.

ఈ పరీక్షలు ఇక్కడే

ఈ లాబొరేటరీ ఏర్పాటు చేస్తే.. ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఆహార నాణ్యత, రసాయనాలు, వినియోగం, పాయిజన్‌, ఆరోగ్యానికి హానీ కలిగించే ఇతర పదార్థాలు వినియోగం, కలుషిత నీటి నిర్ధారణ వంటి పరీక్షల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక హాట్‌ ఎయిర్‌ ఓవెన్‌, మపుల్‌ ఫర్నేస్‌, వాటర్‌బత్‌, ఎల్‌సీఎంఎస్‌, జీసీ-ఎంఎస్‌, ఐపీసీ ఎంఎస్‌, బ్యాలెన్స్‌, ఆటో క్లేవ్‌, మైక్రోస్కోప్‌ వంటి 60 పరికరాలు అందుబాటులోకి వస్తాయని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరికరాల ద్వారా బిస్కెట్స్‌, పాలు, పాల ఉత్పత్తులు, ఆయిల్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ వంటి 17 రకాల ఆహార పదార్థాలను పరీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ ల్యాబ్‌ నిర్వహణకు అవసరమైన సుమారు 70-80 మంది సిబ్బందిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 11:55 PM