పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద జలాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:32 PM
ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులపైగా భారీ వరద కొనసాగుతోంది.
కొత్తపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులపైగా భారీ వరద కొనసాగుతోంది. కొత్తపల్లి మండల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ ఉమామహేశ్వర స్వామి ఆలయంవద్ద పుష్కరఘాట్లను వరద జలాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితమే నదీగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా జలాధి వాసమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఎగువన ఉన్న ఉమా మహేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం పుష్కరఘాట్ల వద్ద పరవళ్లు తొక్కు తున్న వరద జలాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి సందడి చేశారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
శ్రీశైల జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకెళ్లొద్దని తహసీల్దార్ ఉమారాణి హెచ్చరించారు. ఎగువ ప్రాం తాల నుంచి 2లక్షలకు పైగా వరద వస్తున్నందున మరబోట్లు, పుట్టీల ద్వారా మత్స్య కారులు వేటకు వెళ్లవద్దన్నారు. శ్రీశైలం జలాశయ నిండుకుండలా తొణికిసలాడు తోందని బీకర గాలులు వీస్తున్న నేపథ్యంలో అలల తాకిడికి పుట్టీలు, మరబోట్లు తిరగబడే ప్రమాదం ఉందన్నారు.